మా ఫేస్ క్రీమ్ పూసుకోండి, నిగారింపు సొంతం చేసుకోండంటూ గంటకోసారి టీవీల్లో కనిపించే యామి గౌతమ్ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారింది. ఈ హీరోయిన్ కు ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్) నోటీసులు జారీచేసింది. మరో 3 రోజుల్లో (7వ తేదీన) విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.
ఫెమా (ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) నిబంధనల్ని యామీ గౌతమ్ ఉల్లంఘించిందని ఆరోపించింది ఈడీ. నిబంధనలకు విరుద్ధంగా యామీ గౌతమ్ ఎకౌంట్ నుంచి కోటిన్నర వరకు విదేశీ లావాదేవీలు జరిగాయని ఫెమా గుర్తించింది. ఈ మేరకు ఆధారాలతో విచారణకు రావాల్సిందిగా ఈడీ, యామీకి నోటీసులిచ్చింది.
నిజానికి యామీ గౌతమ్ కు ఈడీ నోటీసులివ్వడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో కూడా ఈ హీరోయిన్ నోటీసులు అందుకుంది. కానీ అప్పట్లో ఆమె విచారణకు హాజరుకాలేదు. ఈసారి మాత్రం ఆమె తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. లేదంటే ఆమెపై పోలీసు కేసు నమోదయ్యే ప్రమాదం ఉంది.
విక్కీ డోనార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది యామీ గౌతమ్. ఆ తర్వాత యూరి, బాల, బద్లాపూర్ లాంటి కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె హీరోయిన్ గా కంటే ఫేస్ క్రీమ్ మోడల్ గానే చాలామందికి సుపరిచితం. గత నెల దర్శకుడు ఆదిత్య థర్ ను పెళ్లాడి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన యామి.. ఇప్పుడిలా ఈడీ నోటీసులతో మరోసారి హెడ్ లైన్స్ కెక్కింది.