ఏపీలో వైసీపీకి ఉన్న ప్రజాప్రతినిధులకు కొదవే లేదు. 151 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలు, ఇరవై మంది దాకా ఎమ్మెల్సీలు, ఇక లోకల్ బాడీలలో నూటికి తొంబై శాతం వారే ఉన్నారు.మరి ఇంతమంది ఉండగా ఆ ఒక్క ఎంపీ అంటే ఎందుకు అంతలా వణుకు అంటున్నారు అంతా.
ఇదే అర్ధం కాక వైసీపీ నేతలు కూడా విపక్షాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఆయన్ని చూసి తమ్ముళ్ళు వణుకుతున్నారని వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి పుట్టిన రోజున విశాఖలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఇక విశాఖలో ఎక్కడ చూసినా విజయసాయిరెడ్డి ఫ్లెక్సీలు బ్యానర్లు పెద్ద ఎత్తున కనిపించాయి. ఒక విధంగా విజయసాయిపట్నంగా వైజాగ్ కనిపించింది. దీంతో పసుపు తమ్ముళ్ళకు మండుకొచ్చిందో ఏమో తెలియదు కానీ అఖరుకు వాటి మీద కూడా ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం తమ్ముళ్ళు తయారైపోయాయని వైసీపీ నేతలు విమర్శించారు.
విశాఖలో గజం జాగా కూడా వదలకుండా కబ్జా చేస్తున్న దందాకోర్ల భరతం పడుతున్న సాయిరెడ్డి అంటే వణుకు అని, అందుకే ఇలా కడుపు మంటతో లేని పోని ఫిర్యాదులు చేస్తున్నారని వారు మండిపడ్డారు. మొత్తానికి సాయిరెడ్డి అంటే హడలా. ఆయన మీద అక్కసా.. తమ్ముళ్ళు క్లారిటీ ఇవ్వాలేమో.