ప్రముఖ సినీ క్రిటిక్, నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ కత్తి మహేశ్ చికిత్సకు ఏపీ ప్రభుత్వం భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేసింది. కష్టాల్లో ఉన్న మహేశ్‌కు సీఎం జగన్ బిగ్ సపోర్ట్‌గా నిలిచారు. ఇటీవల విజయవాడ నుంచి చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామానికి వెళుతున్న కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో మొదట నెల్లూరులో చికిత్స తీసుకున్న మహేశ్‌ను మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించారు.
చెన్నైలోని అపోలో ప్రధాన ఆస్పత్రిలో కత్తి మహేశ్‌కు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం జగన్ ప్రభుత్వం రూ.17 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ పేరు మీదుగా లేఖ విడుదల విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని అందించినట్టు డాక్టర్ హరికృష్ణ వెల్లడించారు.
కత్తి మహేశ్ రాజకీయంగా వైఎస్ జగన్ అభిమాని అనే పేరుంది. పవన్‌కల్యాణ్ రాజకీయ విధానాలను తూర్పారపడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పవన్‌కల్యాణ్ అభిమానులకు కత్తి మహేశ్ మింగుడు పడకుండా వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు, అలాగే ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక సందర్భంలోనూ వైసీపీకి మద్దతుగా నిలిచారు.
అలాగని వైసీపీ విధానాలన్నింటిని వెనకేసుకు రాలేదు. విధానాల పరంగా కొన్ని సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లను ఓ రేంజ్‌లో సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటూ కత్తి మహేశ్ నెటిజన్ల అభిమానాన్ని చూరగొన్నారు.
ఇక సినిమాల పరంగా నిజాయితీగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు కత్తి మహేశ్ చెబుతారనే పేరు తెచ్చుకున్నారు. మొత్తానికి వ్యతిరేకించే వారికంటే అభిమానించే వారినే ఆయన ఎక్కువగా సంపాదించుకున్నారు.
ప్రజాస్వామ్య విలువలు కనుమరుగవుతున్న దశలో కత్తి మహేశ్ లాంటి ప్రజాస్వామిక వాది తప్పక ఉండాలనే అభిప్రాయాలు ఇటీవల కాలంలో వెల్లువెత్తాయి. ఆయన వైద్యానికి ఏపీ ప్రభుత్వం భారీ మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందజేయడం అభినందనీయమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.