ఉత్తరాఖండ్ సీఎంగా నాలుగు నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత తీరథ్ సింగ్ రావత్ చేత రాజీనామా చేయించింది ఆ పార్టీ అధిష్టానం. ఈ మేరకు రావత్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి. నాలుగంటే నాలుగే నెలల్లో రావత్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
తన వ్యాఖ్యానాలతో ఇటీవల తీవ్ర వివాదాస్పదం అయ్యారు రావత్. ఆడపిల్లలు జీన్స్ ధరించడాన్ని కూడా ఆక్షేపించారు ఈ కమలం పార్టీ ఎంపీ కమ్ ముఖ్యమంత్రి. మధ్యయుగం తరహా ఆలోచన ధోరణిలో మాట్లాడి సొంత పార్టీ ఆగ్రహానికి కూడా గురయ్యారు.
వాస్తవానికి రావత్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. ఎంపీ హోదాలో ఉంటూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ తరఫున ఎవరు ముఖ్యమంత్రులవుతారో కూడా క్లారిటీ లేని అంశం అవుతోంది.
మ్యూజికల్ చెయిర్స్ తరహాలో మారింది వ్యవహారం. ఎంపీ హోదాలో ఉండిన రావత్ ను తీసుకెళ్లి ముఖ్యమంత్రిని చేశారు. అయితే ఆయన ఇప్పటి వరకూ ఎంపీ హోదాకు రాజీనామా చేయలేదు. కానీ, ఇప్పటికే నాలుగు నెలల పదవీకాలం పూర్తయ్యింది. సెప్టెంబర్ 10 కళ్లా రావత్ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు తగిన నియోజకవర్గం, ఉప ఎన్నిక అన్నీ సాధ్యం అయ్యేలా కూడా లేవు!
ఈ పరిణామాల మధ్య రావత్ ను కొనసాగించడం కన్నా.. ఆయన చేత రాజీనామా చేయించి మరొకరిని సీఎం సీట్లో కూర్చోబెట్టడమే బెటరని బీజేపీ అధిష్టానం భావించినట్టుగా ఉంది. దీంతో ఏరికోరి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి నాలుగు నెలల్లోనే ఆ ముచ్చట ముగుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో అలాంటి ఎన్నికలను నిర్వహించడానికి సీఈసీ సిద్ధంగా లేకపోవచ్చు. ఎలాగూ రావత్ తన వ్యాఖ్యలతో వివాదాస్పదం అయ్యాడు.
ఈ రెండు అంశాలనూ బేరీజు వేసుకుని.. రాజీనామా చోటు చేసుకుందని టాక్. ఉత్తరాఖండ్ బీజేపీ లెజిస్లేటివ్ విభాగం సమావేశం అయ్యి, కొత్త సీఎంను ఎన్నుకుంటుందట. ఎలాగూ కొత్త సీఎం పేరు సీల్డ్ కవర్ లోనే రావొచ్చు! అనే విశ్లేషణలే వినిపిస్తున్నాయి ఢిల్లీ నుంచి! నిన్న లేట్ నైట్ లో ఈ రాజీనామా ప్రకటన రావడం కూడా తీవ్రమైన చర్చకు కారణం అవుతోంది.