జగన్ ప్రభుత్వం తాను అనుకున్నది చేసుకుపోవడమే తప్ప రెండో వైపు చూడటం లేదు. దీంతో కొన్ని విషయాల్లో ప్రభుత్వం వ్యతిరేకతను మూట కట్టుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు సంబంధించి ప్రతి నెలా వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతోంది.
కరోనా విపత్కర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది, చేస్తోంది. దీనికి తోడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తున్నారు. ఇందుకు భారీ మొత్తంలో అప్పులు చేయాల్సిన దుస్థితి. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలే జగన్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యంగా తీసుకుంది. మిగిలిన అంశాలన్నీ, సంక్షేమ పథకాల అమలు తర్వాతే అన్నట్టు పాలనా విధానాలున్నాయి.
ఈ నేపథ్యంలో గత ఏడాది కరోనా సమయంలో ఉద్యోగులు, పింఛనుదారులకు వేతనాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో సంక్షేమ పథకాలను మాత్రం యధాప్రకారం అమలు చేసి ప్రభుత్వం గొప్పలు చెప్పు కుంది. ఇక్కడే ప్రభుత్వం అనవసరంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల దృష్టిలో శత్రువు అవుతోంది. తమకు జీతాలు ఇవ్వడానికి మాత్రం నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం, సంక్షేమ పథకాల అమలుకు మాత్రం ఎట్లా సమకూర్చుకుంటోందనే ప్రశ్నలు వారి నుంచి ఎదురవుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు కావడం వల్ల నోరు తెరిచి మాట్లాడితే ఇబ్బందులు ఎదురవుతాయని లోలోపలే ఆవేదన చెందుతున్నారు. కానీ వారి మనసుల్లో గూడుకట్టుకుంటున్న వ్యతిరేకతను మాత్రం ఎలా కాదంటాం? ఉదాహరణకు జూన్ నెలకు సంబంధించి ఇప్పటి వరకు సగం మందికి మాత్రమే జీతాలు వేసినట్టు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు అందాయంటున్నారు.
ఇక పింఛనుదారులకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జీతాలు అందిన దాఖలాలు లేవు. అలాగే జిల్లాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కదిలిస్తే జీతాలు అందకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు, పింఛనుదారులకు ప్రతినెలా వేతనాల కోసం రూ.5 వేల కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ప్రతినెలా మొదటి తేదీకి ఈ మొత్తాన్ని సమకూర్చు కోవడంలో ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. అయితే తమ జీతాల విషయానికి వస్తే మాత్రం ఆర్థిక ఇబ్బందులా? అనేది ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి ఎదురవుతున్న సూటి ప్రశ్న.
ఇదే సందర్భంలో మరో ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సి వుంది. నిన్న (శుక్రవారం) రాత్రి వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రకాల పింఛనుదారుల్లో 95.4% మందికి పింఛన్ సొమ్మును అందజేసినట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. మొత్తం 58,16,064 మంది పింఛనుదారులకు రూ.1,405.74 కోట్ల పింఛన్ డబ్బు పంపిణీ చేసినట్టు సంబంధిత అధికారులు ప్రకటించడం గమనార్హం.
ప్రతినెలా ఒకటి, రెండు తారీఖుల్లో పింఛన్‌దారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పింఛన్‌ను నేరుగా పంపిణీ చేస్తున్నారని గర్వంగా చెబుతున్న ప్రభుత్వం, అదే స్ఫూర్తి, నిబద్ధత, ఉత్సాహాన్ని తమ విషయంలో ఎందుకు కనబరచడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు జగన్ ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా?
సొదుం రమణ