ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సినీ క్రిటిక్, బిగ్‌బాస్ ఫేమ్ కత్తి మహేష్ వైద్య ఖర్చుల నిమిత్తం ఏపీ ప్రభుత్వం రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయడం తీవ్ర రచ్చకు దారి తీసింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ‘కత్తి’ దూసుకుంటున్నారు. నెటిజన్లు పరస్పరం ఘాటు కామెంట్స్‌తో ‘కత్తి’ యుద్ధం చేసుకుంటున్నారు.
కత్తి మహేష్ హిందూ వ్యతిరేకి కాబట్టే జగన్ ప్రభుత్వం భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందించిందని కొందరు చర్చకు పెట్టారు. మరికొందరు తమ పార్టీ సానుభూతిపరుడు కాబట్టే భారీ మొత్తంలో యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసిందనే వాదనను తెరపైకి తెచ్చారు. ఈ నెగెటివ్ కామెంట్స్‌కు వైసీపీ సోషల్ మీడియా, కత్తి మహేష్ అభిమానులు తమదైన స్టైల్‌లో కౌంటర్ ఇస్తున్నారు.
తీవ్ర గాయాలపాలై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిపై రాజకీయాలేంటి? అంటూ గట్టిగా నిలదీస్తూ దీటైన సమాధానం ఇచ్చారు. కత్తి మహేష్ వైద్యానికి సాయం అందించడాన్ని కూడా వ్యతిరేకిస్తూ విమర్శిస్తున్నారంటే అలాంటి వారిలో ఎంతటి ప్రమాదకరమైన అమానవీయత ఉందో అర్థం చేసుకోవచ్చని కౌంటర్ ఇచ్చారు. అయితే ఇకపై సీఎం రిలీఫ్ ఫండ్ ఉండదని జీవో ఇచ్చిన ప్రభుత్వం కత్తి మహేష్‌కు మాత్రం ఎలా ఇచ్చిందనే నిలదీతలు కూడా లేకపోలేదు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో గత ఏడాది సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించి అవకతవకలు బయట పడటంతో జగన్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఇక మీదట సీఎం రిలీఫ్ ఫండ్ ఉండదని ఏకంగా జీవో తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీలో లేని జబ్బులకు మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్ వర్తింపజేస్తామని పేర్కొంది.
దీంతో అసలు సీఎం రిలీఫ్ ఫండే లేదని చెప్పిన ప్రభుత్వం, కత్తి మహేష్‌కు మాత్రం ప్రత్యేకంగా ఎలా విడుదల చేసిందనే ప్రశ్నలను తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఇటీవల తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చిన విషయాన్ని కత్తి అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కత్తి మహేష్‌కు భారీ మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.