ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో.. నిందితులుగా విచారణను ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖుల్లో ఇప్పటికే చాలా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుల్లో తమకెలాంటి సంబంధం లేదని.. అసలు ఈ కేసులు అర్థరహితం అని, పెట్టుబడులు పెట్టినంత మాత్రాన కేసులు పెడతారా?
సీఎం తనయుడి కంపెనీల్లో తాము పెట్టుబడులు పెట్టకూడదా? లంచాలను ఎవరైనా పెట్టుబడుల రూపంలో ఇస్తారా? లంచాలకు షేర్లు, డివిడెంట్లు ఉంటాయా? ముఖ్యమంత్రి తనయుడి కంపెనీల్లో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందినట్టుగా అవుతుందా? కేబినెట్ నిర్ణయాల మేరకు జరిగిన వాటిల్లో కంపెనీల ఎండీలను నిందితులంటూ కేసులు పెట్టడం సబబేనా? తరహా వాదనలు వినిపిస్తున్నారు ఈ పెట్టుబడిదారులు.
గమనించాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ఈ కేసుల్లో పలువురు అధికారులకు విముక్తి కల్పించారు. అలాగే నాడు ఈ నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ మంత్రులను అస్సలు ఈ కేసుల్లో చేర్చనే లేదు! నిర్ణయాలు తీసుకోవడంలో మంత్రులది కీలక పాత్ర. వారిని నిందితులుగా చేర్చలేదు. అధికారుల్లో చాలా మంది ఈ కేసుల నుంచి బయటకు వచ్చారు. అటు మంత్రులదీ తప్పు గాక, అధికారులదీ తప్పు గాక.. పారదర్శకంగానే పెట్టుబడులు పెట్టిన వారు నిందితులవుతారా? అనేది తేలే సమయం వచ్చినట్టుగా ఉంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఏకంగా 103 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో దేశంలోనే ప్రముఖులైన వ్యాపారస్తులున్నారు. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తో సహా ఇందూ గ్రూప్ తదితర కంపెనీల ప్రతినిధులు నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే శ్రీనివాసన్ ను నిందితుల జాబితా నుంచి తొలగిస్తూ హై కోర్టు తీర్పును ఇచ్చింది. దీనిపై సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించినా, హైకోర్టు తీర్పుపై స్టే రాలేదట.
ఈ నేపథ్యంలో ఇతర నిందితులు కూడా తమ డిశ్చార్జి పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టును కోరుతున్నట్టుగా తెలుస్తోంది. హెటిరో శ్రీనివాస రెడ్డి డిశ్చార్జి పిటిషన్ పై విచారణ జరుగుతోంది. శ్రీనివాసన్ ను ఈ కేసుల నుంచి విముక్తిడిని చేసిన తరహాలోనే తననూ వీటి నుంచి తప్పించాలని శ్రీనివాసరెడ్డి కోరుతున్నట్టుగా తెలుస్తోంది.
సీబీఐ నమోదు చేసిన కేసుల్లో రాజకీయ ఉద్దేశాలున్నాయని.. పెట్టుబడులు పెట్టడం ఎలా తప్పవుతుందని, రేపు మరో సీఎం తనయుడు ఎవరైనా వ్యాపారాలు చేస్తే.. అతడి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం తప్పవుతుందా? అని శ్రీనివాసరెడ్డి తరఫు న్యాయవాది వాదించినట్టుగా సమాచారం. అయితే ఈ కేసులు రాజకీయ ప్రేరేపితం అనే వాదనను సీబీఐ న్యాయవాది ఖండించారట!
ఈ నేపథ్యంలో కోర్టు స్పందిస్తూ.. ఈ కేసుల్లో ఎవరెవరు డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారో వివరాలు ఇవ్వాలని, వాటిపై వరసగా విచారణలు చేపట్టి ఈ అంశాలను తేల్చనున్నట్టుగా ప్రకటించారట. ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేసిన ప్రముఖులు శ్రీనివాసన్ నే ఉదాహరణగా పేర్కొంటున్నట్టుగా స్పష్టం అవుతోంది. శ్రీనివాసన్ పై ఎలాంటి అభియోగాలు మోపారో..తమపై అవే అభియోగాలను మోపారని, ఆయనకు విముక్తి కల్పించినప్పుడు తాము ఎలా నిందితులవుతామనేది వారి వాదన అని స్పష్టం అవుతోంది.
మరి ఈ మేరకు వీరిని ఈ కేసుల నిందితుల జాబితా నుంచి తొలగిస్తే.. చివరకు మిగిలేదెవ్వరు? నాటి మంత్రులు నిందితులు కారు, అధికారులు చాలా మంది విముక్తులయ్యారు, ఇప్పుడు పెట్టుబడిదారుల వాదనతో కోర్టు ఏకీభవిస్తే.. చివరకు ఈ కేసులో మిగిలే ఏకైక నిందితుడు జగన్ మాత్రమేనేమో! మొత్తానికి ఈ కేసు విచారణ రసకందాయకంగా సాగుతోంది. ఒకవైపు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని ఒక కోర్టులో విచారణ, మరో కోర్టులోనేమో ఈ కేసులో ఏకంగా నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లు!