ఇద్దరు కొట్టుకుంటేనే కదా ఇంటి గుట్టు బయటకు వచ్చేది. తెలుగు నటీనటుల సంఘం వ్యవహారం ఇలాగే సాగుతోంది. మా గతంలో జరిగిన లుకలుకలు అన్నీ ఒక్కోటీ బయటకు వస్తున్నాయి.
మా సంఘం కోసం షో లు చేయడంలో జరిగిన వ్యవహారాలు ఒకప్పుడు బయటకు వచ్చాయి, లేటెస్ట్ గా మా కోసం ఓ ఫ్లాట్ కొనడం, దాన్ని తక్కువకు అమ్మేయడం, అది కూడా మా సంఘం కోసం ఏటా డైరీ ప్రింట్ చేసే వ్యక్తికే రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా భరించి అమ్మేయడం వంటి వింత విషయాలు బయటకు వచ్చాయి.
మెగా స్టార్ సోదరుడు నాగబాబు మా ప్రెసిడెంట్ గా వుండగా మా సంఘం కోసం ఓ ఫ్లాట్ కొన్నారట. అది కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వున్న ప్రయిమ్ ఏరియాలో కాదు.
జూబ్లీ హిల్స్ లోనే మురికిగుంట పక్కనట. అది కూడా చిన్న డిస్ప్యూట్ ప్రాపర్టీ అని తెలుస్తోంది. ఆరోజుల్లో 45 లక్షలకు కొన్నారట. దమ్మిడీకి ఏగాణీ క్షవరం అని వెనకటికి సామెత. ఆ విధంగా 45 లక్షల ఫ్లాట్ కు 50 లక్షలతో ఇంటీరియర్ సొగసులు అద్దకం చేసారు.
కానీ దానికి ఎవ్వరూ పోలేదు. పెద్దగా వాడలేదు. దాంతో అది చెదలు పట్టడం ప్రారంభించింది. ఆఖరికి శివాజీ రాజా టైమ్ లో అమ్మేయడానికి ప్రయత్నిస్తే సరిగ్గా బేరాలు రాలేదు. ఆఖరికి కొందరి 'పెద్దల' వత్తిడితోనో, సలహా సూచనలతోనో, 34 లక్షలకు అమ్మేసారు.
అంటే మా సంస్థకు దాదాపు 60 లక్షలు నష్టం. పైగా ఎక్కడయినా కొనుక్కున్నవారు రిజిస్ట్రేషన్ ఖర్చులు భరిస్తారు. కానీ ఇక్కడ విక్రయించిన మా సంఘమే ఆ ఖర్చులు కూడా భరించింది. మరీ అంత ప్రేమేంటో మా కార్యవర్గ బాధ్యులకే తెలియాలి.
ఆ భవనం విక్రయించింది మా సంఘానికి ఏటా డైరీని 8 లక్షలకు ప్రింట్ చేసే వ్యక్తికే. ఈ ఏడాది ఆ వ్యక్తిని పక్కన పెడితే మా సంఘానికి నాలుగు లక్షలు ఆదా అయింది. చాలా కాలంగా ఆ వ్యక్తికే మా డైరీ ప్రింటింగ్ బాధ్యత అప్పగిస్తున్నారట. అంటే ఏటా నాలుగు లక్షలు అదనంగా ఇస్తూ వస్తున్నారని అనుకోవాలన్నమాట.
ఇలాంటి వ్యవహారాలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో?