కేవలం తెలుగు సినిమాలనే నమ్ముకుని ఉంటే హన్సిక కెరీర్ ఈ పాటికి ఎప్పుడో ముగిసేదేమో! హన్సికను తెలుగు వారు మరిచిపోయి అటు ఇటుగా దశాబ్దం గడుస్తోంది. గత పదేళ్లలో హన్సిక తెలుగులో చేసిన సినిమాలేవీ చెప్పుకోదగిన విజయం సాధించలేదు. అసలు చెప్పుకోదగిన సినిమాల్లో హన్సికకు అవకాశాలే రాలేదు.
అరడజను సినిమాలు చేసే సరికల్లా హన్సిక తెలుగు మూవీ మేకర్లకు అంత నచ్చలేదు. అయితే కెరీర్ ఆదిలోనే తమిళం వైపు కూడా ఒక చూపు చూసింది హన్సిక. తెలుగు వారు ఈమెను మరిచిపోయినా.. తమిళులు మాత్రం ఆరాధించారు. దేవతను చేసి గుడి కట్టారు. అంతకు మించి.. సినిమా అవకాశాలను ఇచ్చారు. ఇప్పుడు హన్సిక 50వ సినిమా విడుదలకు రెడీ అవుతోంది!
తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ట్రయిలర్ విడుదల అయ్యింది. బహుశా ఈ సినిమా ఏదైనా ఓటీటీలో విడుదల కావొచ్చు. ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్. తమిళంలో కూడా హన్సికకు పెద్ద హీరోల సరసన అవకాశాలు తగ్గిపోయాయి. అంత మార్కెట్ లేని హీరోల సరసన నటిస్తోంది.
తనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాలు కొన్ని వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడొక క్రైమ్ థ్రిల్లర్ తో పలకరిస్తోంది హన్సిక. తమిళంలో హన్సిక నటించిన పలు సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. అయితే థియేటర్లలో అవేవీ చెప్పుకోదగిన స్థాయిలో విజయాలు సాధించలేదు.
దేశముదురు సినిమాతో హీరోయిన్ గా మారింది హన్సిక. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో పలు సినిమాల్లో నటించింది. దేశముదురు తర్వాత తెలుగులో కంత్రి, మస్కా వంటి అంచనాలున్న సినిమాల్లో నటించింది. జయీభవతో సెకెండ్ లీగ్ లోకి వెళ్లిపోయింది.
ఆ తర్వాత ఈమె తెలుగులో సెకెండ్ లీగ్ హీరోలతోనే నటించింది. అవి కూడా ఏవీ హిట్ కాలేదు. తమిళంలో మాత్రం స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తుండటంతో చెన్నైలోనే సెటిలై, తమిళుల ఆదరణను క్యాష్ చేసుకుంటూ వస్తోంది ఈ నటీమణి. ఇలా ఈ రోజుల్లో హీరోయిన్లకు అరుదుగా మారిన 50 సినిమాల మార్కును అధిగమిస్తోంది.