ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సాహో. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా సైరా. ఇప్పుడీ రెండు సినిమాలు పాన్-ఇండియా అప్పీల్ కోసం తహతహలాడుతున్నాయి. బజ్ ఆ స్థాయిలో లేకపోవడంతో.. బిజినెస్ కూడా ఆ స్థాయిలో జరగడం లేదు. థియేట్రికల్ సంగతి పక్కనపెడితే, ఈపాటికి పూర్తవ్వాల్సిన శాటిలైట్ బిజినెస్ అలానే పెండింగ్ లో పడింది.
స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్ డీల్స్ పూర్తయిపోతుంటాయి. లేదంటే ఫస్ట్ షెడ్యూల్ లోనే అలాంటి ఒప్పందాలన్నీ పూర్తయిపోతాయి. కానీ సాహో, సైరా సినిమాలు మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయ్యాయి. దాదాపు షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసినా ఈ సినిమాలకు సంబంధించి శాటిలైట్ హక్కులు అమ్ముడుపోలేదు. దీనికి కారణం భారీ బడ్జెట్.
భారీ బడ్జెట్ తో ఈ రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. సాహో కోసం 250 కోట్లు, సైరా కోసం 300 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నట్టు స్వయంగా నిర్మాతలు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాల శాటిలైట్ రైట్స్ మొత్తం చెబుతున్నారు. ఆలిండియా రైట్స్ కింద సాహో కోసం 90కోట్లు.. సైరా కోసం 100 కోట్ల రూపాయలు చెబుతున్నారు. ఇంత మొత్తంపెట్టి హక్కులు దక్కించుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.
కనీసం రీజనల్ గా అయినా రైట్స్ అమ్ముదామంటే అది కూడా వీలుపడ్డంలేదు. సాహోకు సంబంధించి కేవలం తెలుగు శాటిలైట్ రైట్స్ కోసం 40 కోట్లు చెబుతున్నారు. అటు సైరాకు కూడా తెలుగు శాటిలైట్ హక్కుల కింద 50 కోట్లు అడుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీ ఛానెళ్లకు ఇది కూడా చాలా పెద్ద మొత్తం కిందలెక్క. అందుకే ఈ సినిమాల రైట్స్ అలానే ఉండిపోయాయి. ఉన్నంతలో సాహోకు సంబంధించి హిందీ శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం చెప్పుకోదగ్గ విశేషం.
ఇక ఈ కోణంలో సైరాకు సంబంధించి ఓ టార్గెట్ కూడా పెట్టుకున్నారు మేకర్స్. శాటిలైట్ రైట్స్ లో రజనీకాంత్ నటించిన 2.O సినిమా 110 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ రికార్డును బ్రేక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట సైరా మేకర్స్. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇప్పటివరకు అమ్ముడుపోకపోవడానికి ఇది కూడా ఓ కారణం. మరోవైపు సైరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకోవడానికి ముందుకొచ్చిన అమెజాన్ కూడా వెనక్కి తగ్గినట్టు సమాచారం.