హోదాపై హోం వర్క్.. ఈసారి ఏ టర్న్ బాబూ!

ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా దాన్ని అడ్డం పెట్టుకుని కనీసం కొంతమందినైనా రెచ్చగొట్టొచ్చు, వారితో ఓట్లు వేయించుకోవచ్చు. అయితే హోదాపై ఆల్రెడీ అష్ట వంకరలు…

ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా దాన్ని అడ్డం పెట్టుకుని కనీసం కొంతమందినైనా రెచ్చగొట్టొచ్చు, వారితో ఓట్లు వేయించుకోవచ్చు. అయితే హోదాపై ఆల్రెడీ అష్ట వంకరలు తిరిగేసిన చంద్రబాబుకి మాత్రం ఆ పేరెత్తే అర్హత లేదు. అయినా కూడా బాబు హోదా గురించి మాట్లాడే సాహసం చేస్తున్నారంటే.. జనాలు అన్నీ మరచిపోతారని ఆయనకి అంత నమ్మకం.

హోదాయే కావాలని ఓసారి, హోదా సంజీవని కాదు, ప్యాకేజీయే ముద్దు అని మరోసారి, చివరకు ఎన్నికలనాటికి ప్రత్యేక హోదా కోసం పోరాటం, బీజేపీ మోసం చేసిందంటూ నాలుక మడతేయడం, నల్ల బ్యాడ్జ్ లు కట్టుకొని తిరగడం.. అబ్బో చంద్రబాబులో చాలా కోణాలు చూసేశారు తెలుగు ప్రజలు. కానీ ఇప్పుడు అదే సబ్జెక్ట్ పై మరో కోణం బయటపెడతానంటున్నారు బాబు. హోదా విషయంలో హోం వర్క్ మొదలుపెట్టారు.

ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించి నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. స్పెషల్ స్టేటస్ అనే వాగ్దానంతో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమిలో భాగస్వామి బాబు. ఆ తర్వాత సిగ్గులేకుండా కేంద్రం వద్ద లొంగిపోయి, స్పెషల్ ప్యాకేజీకి ఓటేశారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. హోదా గురించి అడిగితే జైలుకే అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు. సరిగ్గా ఎన్నికలకు ముందు మళ్లీ స్పెషల్ స్టేటస్ కావాలంటూ బీజేపీకి విడాకులిచ్చారు. ఈసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు.

మరో మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలున్నాయి కాబట్టి, ఇప్పటినుంచే హోదాపై ఏం చేద్దామంటూ టీడీపీ నేతల్ని ప్రశ్నిస్తున్నారు బాబు. జనాల్లో స్పెషల్ స్టేటస్ పై మూడ్ ఎలా ఉందో కనిపెట్టాలంటూ సర్వే చేయిస్తున్నారు.

వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి చంద్రబాబు వద్ద సబ్జెక్ ఏదీ మిగల్లేదు. అభివృద్ధి, సంక్షేమం విషయాల్లో బాబు నోరెత్తలేరు. రాగా పోగా ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదు అని మాత్రం ప్రశ్నించొచ్చు. బలంగా ఉన్న కేంద్రం ఎవరిమాటా వినట్లేదనే విషయం అందరికీ తెలిసిందే అయినా, చంద్రబాబు మాత్రం దీన్ని ఎన్నికల సబ్జెక్ట్ గా మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆమాటకొస్తే అసలు హోదా గురించి మాట్లాడే అధికారం, అర్హత రెండూ వైసీపీకే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచీ వైసీపీ హోదాకు మద్దతుగానే మాట్లాడుతోంది. ప్యాకేజీకి అమ్ముడుపోయిన చంద్రబాబుని ఆనాడు ఎండగట్టిన జగన్, ఊరూరా ప్రత్యేక హోదా ఉద్యమాలకు నాంది పలికి యువతలో చైతన్యం రగిల్చారు. కేంద్రం కుదరదంటున్నా ఇప్పటికీ ఆ విషయంలో ఢిల్లీతో ఢీ కొట్టడానికి రెడీగానే ఉన్నారు జగన్. కొన్ని రోజుల కిందట కూడా హోదాపై తమ వైఖరిని స్పష్టంచేశారు.

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీకి అన్ని సానుకూలతలు ఉన్నా కూడా చంద్రబాబు ఏదో మాయ చేసి, అసలు హోదా అనే అంశాన్ని లేవనెత్తింది తానే అని చెప్పుకోగల సమర్థుడు. దానికి ఆయన అను'కుల' మీడియా అండదండలు పుష్కలంగానే ఉంటాయి కూడా. వచ్చే ఎన్నికలనాటికి హోదా అంశాన్ని చంద్రబాబు ఎలా తెరపైకి తెస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా ఆ పేరుతో మరోసారి ఆయన ఊసరవెల్లి రంగుల్ని ఏపీ ప్రజలకు పరిచయం చేయడం మాత్రం ఖాయం.