థ‌ర్డ్ వేవ్‌పై ప్ర‌సిద్ధ డాక్ట‌ర్ ఏమంటున్నారంటే…

క‌రోనా ఫ‌స్ట్‌, సెకెండ్ వేవ్‌ల నేప‌థ్యంలో వైద్య నిపుణులు ప‌లు ర‌కాల సూచ‌న‌లు ఇస్తూ అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఛైర్మన్, ప్ర‌సిద్ధ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి…

క‌రోనా ఫ‌స్ట్‌, సెకెండ్ వేవ్‌ల నేప‌థ్యంలో వైద్య నిపుణులు ప‌లు ర‌కాల సూచ‌న‌లు ఇస్తూ అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఛైర్మన్, ప్ర‌సిద్ధ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ప‌లు సంద‌ర్భాల్లో కీల‌క విష‌యాలు చెబుతూ జ‌నాన్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. అలాగే క‌రోనాకు సంబంధించి ప్ర‌చారంలో ఉన్న వివిధ రకాల అనుమానాల‌ను ఆయ‌న తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మాన‌సిక ధైర్యాన్ని క‌లిగిస్తున్నారు.

ఈ ప‌రంప‌ర‌లో థ‌ర్డ్ వేవ్‌పై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తిని, దాని తీవ్ర‌త‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని భ‌విష్య‌త్‌లో ఎలా ఉండ‌బోతున్న‌దో ఆయ‌న ఓ అంచ‌నాకు వ‌చ్చారు. త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. పిల్ల‌ల‌పై థ‌ర్డ్ వేవ్ పంజా విసురుతుంద‌నే ప్ర‌చారాన్ని ఆయ‌న తిప్పి కొట్టారు. తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) గురువారం నిర్వహించిన వెబినార్‌లో ‘అందరికీ ఆరోగ్యం’ అనే అంశంపై ఆయన మాట్లాడారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని బట్టిచూస్తే మన దేశంలో థర్డ్‌ వేవ్‌ ఉండే అవకాశం ఉందని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి తేల్చి చెప్పారు. సెప్టెంబరులో అది వచ్చే అవకాశం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే థ‌ర్డ్ వేవ్ ఏదో విల‌యం సృష్టిస్తుంద‌నే భ‌యాందోళ‌న‌ల‌కు గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. వైరస్‌లో తీవ్రమైన ఉత్పరివర్తనాలు జరిగితే తప్ప ఇక్కడ దాని ప్రభావం తక్కువేనన్నారు.

మ‌రీ ముఖ్యంగా పిల్లలపై థ‌ర్డ్ వేవ్ పంజా విసురుతుంద‌నే ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు.  తొలి రెండు దశల్లోనూ పిల్లలపై ఇన్‌పెక్షన్‌ ప్రభావం చూపిందన్నారు. ఇప్పటికే చాలామంది పిల్లల్లో యాంటీబాడీలు వృద్ధి చెందాయన్నారు. వేగవంతమైన టీకాల పంపిణీతో పాటు కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా థర్డ్‌వేవ్‌ను అడ్డుకోవచ్చని సూచించారు. సంవ‌త్స‌రం తర్వాత కరోనా సాధారణ జలుబు, దగ్గు, జ్వరంలా మారిపోతుందనే ఆయ‌న అభిప్రాయాలు చాలా విలువైన‌విగా భావించొచ్చు.