దుబారా అంటే ఏంటి, అసలు దేనిని అంటారు. అయిదు వేళ్ళూ నోట్లోకి వెళ్ళేలా పేదలకు వివిధ సంక్షేమ పధకాల ద్వారా అందచేయడాన్ని దుబారా అనగలరా. నగదు నేరుగా పేదింటి ఖాతాలోకి వెళ్ళడాన్ని దండుగమారి వ్యవహారం అని ఎవరైనా అనగలరా.
నిజానికి దేశమంతా కరోనాతో అల్లల్లాడుతున్న వేళ కూడా ఏపీలో సంక్షేమ రధం సవ్యంగా కదిలింది. పేద వాడి చేతిలో కరెన్సీ కళకళలాడింది అంటే అది జగన్ సర్కార్ సంక్షేమ పధకాల వల్లనే కదా.
ఆర్ధిక సంక్షోభం దేశంలో తలెత్తకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయమని మహా మహా కొమ్ములు తిరిగిన ఆర్ధిక వేత్తలు కరోనా వేళ పాలకులకు సూచించిన సంగతి అందరికీ తెలుసు కదా.
మరి ఇన్నీ తెలిసి కూడా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ప్రజా ధనం పెద్ద ఎత్తున దుబారా అవుతోందని తెగ గాబరా పడుతున్నారు. దానికి అరికట్టాలంటూ ఆయన సూచనలు చేస్తున్నారు.
విపక్షంగా దుబారా ఎక్కడ జరుగుతుందో చెబితే మంచిచే కానీ ప్రభుత్వం లెక్కలు చూపిస్తూ మరీ లక్ష కోట్ల రూపాయల దాకా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశామని అంటోంది. దాన్ని దుబారా అని కనుక అనుకుంటే మాత్రం అచ్చెన్నాయుడు విమర్శలకు పస లేనట్లే. ఏది ఏమైనా డైరెక్ట్ గా పధకాలు వద్దు అనలేక ఇలా దుబారా అని తమ్ముళ్ళు గుండెలు బాదుకుంటున్నారని వైసీపీ నేతలు కౌంటరేస్తున్నారు.