2 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులపై కోవావాక్స్ క్లినికల్ ప్రయోగాలు ఇప్పుడే వద్దని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ కీలక సూచనలు చేసింది. పిల్లలపై ప్రయోగాల కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి నిపుణుల కమిటీ గట్టిగా సిఫార్సు చేయడంపై దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఇప్పటికే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేశారు. మన దేశంలో 45 ఏళ్ల పైబడి వయస్కులకు మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకా వేసేందుకు చర్యలు చేపట్టారు.
ఇతర దేశాల్లో చిన్నారులకు కూడా టీకా వేస్తున్న దృష్ట్యా మనదేశంలో కూడా ఆ వైపు కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. దీంతో పిల్లల టీకాలకు సంబంధించి ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని భావించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన నొవావాక్స్ అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ‘కొవొవాక్స్’ పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 18 ఏళ్లు పైబడినవారిపై ఈ టీకా క్లినికల్ ట్రయల్స్‌ను కంపెనీ ప్రారంభించింది.
ఈ నెల (జులై) నుంచి చిన్నారులపై కూడా ప్రయోగాలు జరపాలని భావించింది. ఇందుకోసం గత సోమవారం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. దేశ వ్యాప్తంగా 10 కేంద్రాల్లో 920 మంది చిన్నారుల (2-11 ఏళ్ల వారు 460 మంది, 12-17 ఏళ్ల వారు 460 మంది)పై రెండు, మూడో దశ క్లినికల్ ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ దరఖాస్తును డీసీజీఐ.. నిపుణుల కమిటీకి పంపించింది.
దీంతో ఏఏ దేశాల్లో ఈ టీకాను వాడారనే విషయమై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ ఆరా తీసింది. ఈ వ్యాక్సిన్ ఎక్కడా వాడలేదని, పైగా ఏ దేశంలోనూ అనుమతి పొందలేదనే విషయాన్ని తెలుసుకుని అప్రమత్తమైంది. అనవసర ప్రయోగాలకు వెళ్లడం మంచిది కాదని, మరికొన్ని రోజులు వేచి చూసే ధోరణి మంచిదని భావించింది. దీంతో నిపుణుల కమిటీ కీలక ప్రకటన చేసింది.
‘ప్రస్తుతం పెద్దలపై జరుగుతున్న కొవొవాక్స్ క్లినికల్ ప్రయోగాల భద్రత, సమర్థత ఫలితాలను కంపెనీ సమర్పించాలి. ఆ ఫలితా లను పరిశీలించిన తర్వాతే చిన్నారులపై ప్రయోగాల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని కమిటీ సున్నితంగా ప్రయోగాల్ని తిరస్కరించడం గమనార్హం. చిన్నారులపై ప్రయోగాలకు సీరమ్‌కు ఇప్పుడే అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్రానికి సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది.