టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు రీల్‌లోనే కాదు, రియల్ హీరో అని కూడా అనిపించకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పిల్లలకు తానున్నానంటూ అండగా నిలిచాడు. కష్టాల్లో ఉన్న వారిపై మానవత్వం చాటుకున్న సంపూర్ణేష్ బాబు పెద్ద మనసు గురించి తప్పక తెలుసుకోవాలి.
దుబ్బాక పురపాలక పరిధిలోని నరసింహచారి దంపతులు అప్పుల భారం మోయలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ దంపతుల ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు. ఈ విషయం తెలిసి సంపూర్ణేష్ బాబు కలత చెందారు. ఆ పిల్లలిద్దరినీ ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు.
తన స్నేహితుడితో కలిసి ఆ ఆడబిడ్డలిద్దరికీ 25 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. మనిషన్న తర్వాత కష్టనష్టాలుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యకు పాల్పడవద్దని కోరారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడం వల్ల పిల్లలు అనాథలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఆవేదనను ఫేస్‌బుక్ వేదికగా సంపూర్ణేష్‌బాబు వ్యక్తం చేశారు.
“దుబ్బాకలో నరసింహచారి దంపతులు ఆత్మహత్య చేసుకున్న వార్త చూసి గుండె తరుక్కుపోయింది. కరోనా కష్టకాలంలో ఎంతో మంది పనులు కోల్పోయి వీధిన పడుతున్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన ఆ పిల్లలకు Rs.25000/- నేను, మా హృదయ కాలేయం, కొబ్బరిమట్ట నిర్మాత Sai Rajesh అందించాం.
ఎంత వరకు చదువుకుంటే అంత పూర్తి ఖర్చులు మేమే చూసు కుంటామని వారికి మాట ఇచ్చాం. ఈ కష్టకాలంలో తోటి వ్యక్తులకు మన వంతు సహాయం అందిచడం మన కర్తవ్యం” అని ఆయన పేర్కొన్నారు.
సంపూర్ణేష్ బాబు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటారనే పేరుంది. ఇటీవల కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీకి, అలాగే వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కి, ఇటీవల ఆకస్మిక మృతి చెందిన సినీ జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి రూ.50 వేలు ఆర్ధిక సాయం సంపూర్ణేష్ అందించారు. సంపూర్ణేష్ పెద్ద మనసుపై నెటిజన్లు పొగడ్తలు కురిపించారు.
తాజాగా మరోసారి తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలకు సాయం చేసి మంచి మనసున్న మనిషిగా, హీరోగా గుర్తింపు పొందడం విశేషం. సంపూర్ణేష్ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొని, ఆ తర్వాత ఆ వాతావరణంలో ఇమడలేక బయటికొచ్చిన సంగతి తెలిసిందే.