కొత్త ఐటీ పాలసీని అటు ఉద్యోగులతో పాటు, ఇటు ఐటీ సంస్థలు కూడా పెద్ద ఎత్తున అహ్వానిస్తున్నాయి. దానికి కారణం ఈ పాలసీ ఉభయులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండడమే.
రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఐటీ పాలసీ అనగానే విశాఖ ఐటీ సెజ్ పూర్తి ఆసక్తిని కనబరచింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ పాలసీ వల్ల విశాఖలో ఐటీ రంగం మరింతగా వేళ్ళూనుకునే అవకాశాలు ఉంటాయని ఐటీ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఐటీ పాలసీలో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఉన్నాయని వాటిని తాము పూర్తిగా ఉపయోగించుకుంటామని అంటున్నారు. ఇక స్థానిక ఐటీ కంపెనీలకే ప్రభుత్వ యాప్ లను తయారు చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా పది లక్షల నుంచి కోటి రూపాయల విలువల చేసే వర్క్ ఆర్డర్లు దక్కుతాయని అంటున్నారు.
అదే విధంగా కొత్త ఐటీ పాలసీ ప్రకారం ఒక ఉద్యోగిని ఐటీ కంపెనీ తీసుకుని ఏడాది పూర్తి చేస్తే ఆ ఉద్యోగి జీతంలో పది శాతం ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తుంది.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఉద్యోగుల విషయంలో అయితే ఏకంగా 15 శాతం జీతం ప్రభుత్వం ఇస్తుంది. ఇక అభ్యర్ధిని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్ మెంట్ కూడా ఇచ్చే ఐటీ సంస్థలకు పది వేల రూపాయలు ఇన్సెంటివ్ గా ఇవ్వడం చాలా మంచి విధానం అంటున్నారు.
మరో వైపు కమర్షియల్ టారీఫ్ లో ఉన్న ఐటీ కంపెనీలను ఇండస్ట్రియల్ టారిఫ్ లోకి తీసుకురావడం వల్ల విద్యుత్ రాయితీ చాలా పెద్ద ఎత్తున సమకూరుతుంది. మొత్తం మీద ఐటీ పాలసీతో విశాఖలో మరింత పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమ వేళ్ళూనుకుంటుదని ఐటీ సంస్థల ప్రతినిధులు అంటున్నారు.