పవన్ కల్యాణ్ కనబడుట లేదు. ఒక రోజు, రెండు రోజులు కాదు.. నెల, 2 నెలలు కాదు.. సుదీర్ఘ కాలంగా పవన్ కల్యాణ్ మౌనంగా ఉండిపోయారు. బహుశా ఈ మౌనం ఇంకెన్నాళ్లు ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సంరంభం మధ్యలో సడన్ గా పవన్ కల్యాణ్ కి కరోనా వచ్చింది. ఆ దెబ్బతో జాతీయ నాయకులు వచ్చే మీటింగ్ లకు సైతం డుమ్మా కొట్టి పవన్ హైదరాబాద్ వచ్చేశారు.
కనీసం కరోనా తగ్గిన తర్వాతైనా పవన్ బాహ్యప్రపంచంలోకి వస్తారనుకున్నారంతా. పవన్ తో పాటు అందరికీ కరోనా తగ్గింది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టడం, ఎత్తేయడం అన్నీ జరిగిపోయాయి. కానీ పవన్ మాత్రం ఇంకా హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. బహుశా భారతదేశంలో సుదీర్ఘ కాలం పాటు హోమ్ ఐసోలేషన్లో ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు పవనే అనుకోవాలి. ఆ రికార్డ్ ఇంకా కొనసాగుతూనే ఉండటం ఇంకా విశేషం.
ఇంతకీ పవన్ సమస్య ఏంటి..? దేశాన్ని, ఏపీలో ప్రజల్ని ఉద్ధరించక్కర్లేదు. కనీసం తనపై నమ్మకం పెట్టుకున్న జనసైనికుల్లో అయినా పవన్ తానున్నాననే ధైర్యం నింపాలి కదా. ఇలా నాయకుడే అడ్రస్ లేకుండా పోయినప్పుడు సైనికులు ఏం చేస్తారు? వారికి దారి చూపే నాయకుడెవరు? అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటాడనుకున్నా కూడా ఇప్పుడది పూర్తిగా తగ్గిపోయింది.
ట్వీట్లు వేయడం కూడా పూర్తిగా తగ్గించేశారు పవన్ కల్యాణ్. ప్రెస్ నోట్ లు లేవు, స్టేట్ మెంట్లు లేవు, జనాల్లోకి వచ్చి చేయాల్సిన హడావిడి అసలే లేదు. ఈ గ్యాప్ చాలదా పవన్ పై సీజనల్ పొలిటీషియన్ అనే ముద్ర బలంగా పడటానికి.
రెచ్చిపోవడం.. తప్పుకోవడం
ఒక్కసారిగా జనాల్లోకి రావడం, మాటలతో రెచ్చిపోవడం, మేకపోతు గాంభీర్యం చూపించడం, వైసీపీ నాయకులను నోటికొచ్చినట్టు తిట్టడం, మళ్లీ వెంటనే తెరవెనక్కి వెళ్లి దాక్కోవడం. ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ చేసింది ఇదే. అయితే ఈసారి గ్యాప్ బాగా ఎక్కువైంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తామేనంటూ చెప్పుకునే బీజేపీ-జనసేన.. అసలు యాక్టివిటీని పూర్తిగా తగ్గించేసుకున్నాయి.
అప్పుడప్పూడూ బీజేపీ నేతలైనా కెమెరాల ముందుకొచ్చి హడావిడి చేస్తున్నారు కానీ, పవన్ మాత్రం పూర్తిగా సైలెంట్. అసలు పవన్ మెంటాలిటీ అంతే అనుకోవచ్చు. ఆ క్షణానికే ఆవేశంగా మాట్లాడతారు, ఆ వెంటనే మౌనమునిలా మారిపోతారు. అయితే ఈసారి మాత్రం ఆవేశం కంటే మౌనమే పవన్ ను ఎక్కువగా డానిమేట్ చేసినట్టుంది.
బీజేపీ పొత్తుపై అసంతృప్తి ఉందా..?
ఇకపై బీజేపీ, జనసేన రెండు పార్టీలు కాదు, ఒకటే మాట, ఒకటే బాట అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు అధినేతలు. తీరా క్షేత్ర స్థాయిలో ఎవరి మధ్య ఎంత సమన్వయం ఉందనే విషయం స్థానిక ఎన్నికల్లోనే తేలిపోయింది.
ఈమధ్య గ్యాప్ మరీ ఎక్కువ కావడంతో బీజేపీ నేతలు సొంతగానే నిరసన ప్రదర్శలు చేపడుతున్నారు. దీంతో పవన్ పొలిటికల్ ప్లాన్స్ మారుస్తున్నారేమోననే అనుమానం కలగకమానదు. మౌనంగానే బీజేపీకి దూరం జరుగుతున్నారేమోననే భావన కూడా జనసైనికుల్లో వస్తోంది.
సినిమాల కోసం రాజకీయాలు పక్కనపెట్టారా?
సినిమాల కంటే తనకు రాజకీయాలే ఎక్కువన్నారు. ప్రజల బాగుకోసమే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు. అయితే అంతలోనే డబ్బుల కోసం సినిమాలూ కావాలని మాట మార్చారు. ఇటీవల పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెంచారు.
ఇదీ పవన్ కల్యాణ్ రాజకీయాలు టు సినిమాలు, సినిమాలు టు రాజకీయాల మధ్య జరిగిన ప్రస్థానం. వరుసబెట్టి సినిమాలు ఒప్పుకోవడం వల్లే పవన్ రాజకీయాలకు టైమ్ కేటాయించలేకోపోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అందుకే ఈ మౌనం అని కూడా అనుకోవచ్చు.
జనం మధ్యకు జనసేనాని ఎప్పుడు?
శవ రాజకీయాలతో లోకేష్ వచ్చేశారు. సాధన దీక్ష అంటూ బాబు కూడా రోడ్డెక్కారు. బీజేపీ వాళ్లు అడపాదడపా రోడ్లపైనే హంగామా చేస్తున్నారు. ప్రతిపక్షాల్లో ఇక మిగిలింది పవన్ కల్యాణ్ మాత్రమే. ఆయనెప్పుడు మళ్లీ జనాల్లోకి వస్తారు..? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.