అన్ లాక్ అన్నిచోట్లా మొదలైంది. అన్నిట్లోనూ మొదలైంది. అయితే గుడులు, బడుల విషయంలోనే ఇంకా ప్రభుత్వం తొందరపడటం లేదు. సెకెండ్ వేవ్ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పుడప్పుడే విద్యార్థులు స్కూళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. అదే సమయంలో ఆలయాల విషయంలో కూడా నిబంధనలు పూర్తిగా సడలించే అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సర్వదర్శనాలు ఇంకా మొదలు కాకపోవడమే దీనికి నిదర్శనం..
ఫస్ట్ వేవ్ సమయంలో విధించిన లాక్ డౌన్ సందర్భంగా తిరుమల ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. దాదాపు 80 రోజుల పాటు భక్తుల దర్శనాలు లేకుండానే శ్రీవారి కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు అర్చక స్వాములు. సెకండ్ వేవ్ సమయంలో మాత్రం ఆలయాన్ని పూర్తిగా మూసివేయకుండా భక్తుల దర్శనాలు కొనసాగాయి.
సర్వ దర్శనాలు లేకుండా కేవలం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు అనుమతించారు. అయితే అవి కూడా పరిమితంగానే మంజూరు చేశారు. మరోవైపు ప్రజా రవాణా కూడా నిలిచిపోవడంతో తిరుమలపై రద్దీ బాగా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు అన్ లాక్ మొదలైనా కూడా దర్శనాల కోటా పెంచకపోవడం విశేషం.
ఏపీలో అన్ లాక్ పూర్తి స్థాయిలో మొదలైనా ఐదు జిల్లాలను దాన్నుంచి మినహాయించారు. కరోనా పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఆయా జిల్లాల్లో పూర్తి స్థాయిలో పర్మిషన్లు లేవు. అందులో చిత్తూరు జిల్లా కూడా ఉండటంతో.. తిరుమల దర్శనాల విషయంలో అధికారులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. తిరుమల సర్వదర్శనాలను ఇంకా ప్రారంభించ లేదు సరికదా.. 300 రూపాయల టికెట్ల కోటాను కూడా పూర్తి స్థాయిలో పెంచలేదు.
కర్ఫ్యూ ఆంక్షలు సడలించిన తర్వాత జూన్ లో రోజుకి సగటున 18వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. జులై నుంచి దర్శనాల కోటా పెరుగుతుందని బావించినా.. ఆన్ లైన్ టికెట్ల కోటా పెంచలేదు. మరోవైపు రవాణా మెరుగుపడటంతో సామాన్య భక్తులు సర్వదర్శనం కోసం వచ్చి వేచి చూస్తున్నారు.
ఇటీవలే టీటీడీ పాలకమండలి కాలపరిమితి ముగిసింది. ఈవో కే అన్ని అధికారాలు ఉన్నా కూడా దర్శనాల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు మరింత చక్కబడేంత వరకు, థర్డ్ వేవ్ ముప్పు లేదని తేలే వరకు పరిమితంగానే భక్తులను అనుమతించాలని అనుకుంటున్నారు.