వరల్డ్ స్లీప్ డే.. మంచి నిద్రకు ఉత్తమ మార్గాలు

ఈమధ్య ఓ అందమైన అమ్మాయి ఆన్ లైన్ వీడియోలో మాట్లాడుతూ అలా నిద్రలోకి జారుకుంటే అంతా తెగ ముచ్చటపడ్డారు. ఆమెను డిస్టర్బ్ చేయకుండా అలానే ఉండిపోయారు. అంతేకాదు.. మెచ్చుకుంటూనే, ఆమె ఎకౌంట్లోకి భారీగా డబ్బులు…

ఈమధ్య ఓ అందమైన అమ్మాయి ఆన్ లైన్ వీడియోలో మాట్లాడుతూ అలా నిద్రలోకి జారుకుంటే అంతా తెగ ముచ్చటపడ్డారు. ఆమెను డిస్టర్బ్ చేయకుండా అలానే ఉండిపోయారు. అంతేకాదు.. మెచ్చుకుంటూనే, ఆమె ఎకౌంట్లోకి భారీగా డబ్బులు వేశారు. ఉరుకుల-పరుగుల జీవితంలో జనాలు నిద్రకు ఎంత మొహం వాచిపోయారో ఈ ఒక్క ఘటన చెప్పకనే చెబుతోంది.

అందుకేనేమో వరల్డ్ స్లీప్ డే (ప్రపంచ నిద్ర దినోత్సవం) అంటూ ఓ రోజు పుట్టుకొచ్చింది. ఆరోజు ఈరోజే. నిద్ర ఆవశ్యకతను తెలపడం కోసం ప్రత్యేకంగా ఈ రోజును సెలబ్రేట్ చేస్తున్నారు. జ్ఞాపకశక్తి, హార్మోన్ల నియంత్రణ, గుండె పనితీరు లాంటి ఎన్నో కీలకమైన అంశాలు నిద్రపై ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ఈరోజు మరోసారి నిపుణులు మనకు గుర్తుచేస్తున్నారు.

మరి మంచిగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? రోజంతా ఉన్న టెన్షన్లు మన నిద్రకు భంగం కలిగించకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? దీనికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వీటిలో ముఖ్యమైనది నిద్రకు ఓ టైమ్ కేటాయించడం. ప్రతిరోజు నిద్రపోయే టైమ్ పక్కాగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా ఓ టైమ్ కేటాయించడం వల్ల శరీరం, మెదడు నిద్రకు ఆటోమేటిగ్గా అలవాటు పడతాయని చెబుతున్నారు.

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న కునుకు తీసే అలవాటు ఉన్నవాళ్లు 45 నిమిషాలకు మించి నిద్రపోకూడదు. అంతకుమించి పడుకుంటే, రాత్రి నిద్రరాదు. అంతేకాదు, పడుకోవడానికి 2 గంటల ముందే భోజనం పూర్తిచేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే నిద్రకు కూడా ఇదే సరైన మార్గం అంటున్నారు.

ఇక అతిగా మద్యం సేవించడం, పడుకునే ముందు సిగరెట్ తాగడం, కాఫీ తాగడం లాంటి అలవాట్లు కూడా మానుకోవాలని సూచిస్తున్నారు. దీనిబదులు పడుకునే ముందు ఏదైనా పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే మంచిది.

ఇక పడుకునే గది ఎలా ఉండాలనే అంశంపై కూడా శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు చేస్తున్నారు. గదిలోకి ఎక్కువగా బయట శబ్దాలు రాకూడదు. గది ఉష్ణోగ్రత మరీ వేడిగా, అలాగని మరీ చల్లగా ఉండకూడదు. సౌకర్యవంతమైన దిండు, పరుపు వాడాలి. రూమ్ లో కాస్త తక్కువగా వెలుతురు ఉండేలా చూసుకోవాలి. గాలి బయటకుపోయే మార్గం (వెంటిలేటర్) తప్పనిసరి. 

'మోస‌గాళ్లు' మేకింగ్ వీడియో

నా రగ్డ్‌ లుక్‌ కోసం రెండు నెలలు కష్టపడ్డాను