కరోనా అన్ లాక్ తర్వాత టాలీవుడ్ లో జరగబోయే అతి పెద్ద ఫంక్షన్ అది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న తొలి సినిమాకి సంబంధించిన కార్యక్రమం, అన్నిటికీ మించి మెగా హీరోల అరుదైన కలయికకు వేదిక కాబోతున్న ఈవెంట్. అందుకే దానికంత ప్రత్యేకత.
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి, చరణ్ హాజరవుతారన్న విషయం తెలిసిందే. ఫంక్షన్ కోసం కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టడానికి నిర్మాత దిల్ రాజు సిద్ధమైన వేళ, ఆ ఫంక్షన్ ని ఎంత గ్రాండ్ గా జరపాలా అని ఈవెంట్ మేనేజర్లు స్కెచ్ లు గీస్తున్నారు. అయితే ఆ ఫంక్షన్ ఫ్యాన్స్ మధ్యలోనా, లేక ఫ్యాన్స్ పరోక్షంలోనా అనేది తేలాల్సి ఉంది.
కరోనా సెకండ్ వేవ్ భయాల నేపథ్యంలో ఫ్యాన్స్ తో కలిసి ఫంక్షన్ పెడితే రచ్చ రచ్చ అయిపోతుందని భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. ఫ్యాన్స్ ని పిలిచి, పాస్ లు ఇచ్చి, చివరకు కొవిడ్ నిబంధనల పేరుతో ఆంక్షలు విధిస్తే ఎవరూ ఊరుకోరు. అదే సమయంలో ఫ్యాన్స్ లేకుండా హోటల్ లో కార్యక్రమం పెడితే అంత కంటే నీరసం ఇంకోటి ఉండదు. అందుకే ఈ వేడుక వ్యవహారంలో ఫ్యాన్స్ ని పిలవాలా వద్దా అనే విషయాన్ని హీరో పవన్ కల్యాణ్ కే వదిలిపెట్టాడు నిర్మాత దిల్ రాజు.
మెగా హీరోల సినిమా ఫంక్షన్ అంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అరుపులు, కేకలు, ఈలలు.. అసలు ఫంక్షన్ కి హాజరయ్యేవారు మాట్లాడటానికే అవకాశం ఉండదు. అయినా కూడా హీరోలంతా అలాంటి ఫంక్షన్లనే ఇష్టపడతారు.
తమను చూసి అభిమానులు చేసే గోలను ఎంజాయ్ చేస్తారు. అందులోనూ పొలిటికల్ హీట్ బాగా ఉన్న ఈ టైమ్ లో పవన్ గురించి చిరు ఏం మాట్లాడతారు, చిరు గురించి పవన్ ఎలా స్పందిస్తారనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఆచార్య విషయాలు చెబుతారా, ఆర్ఆర్ఆర్ విశేషాలు పంచుకుంటారా అనే ఆసక్తి కూడా ఉంటుంది.
ఈ సమయంలో ఫ్యాన్స్ లేకుండా ప్రీ-రిలీజ్ వేడుక అంటే అంతకంటే ఆశాభంగం మరోటి ఉండదు. ఇటీవల ఖమ్మంలో జరిగిన శ్రీకారం మూవీ ఫంక్షన్ కి చిరు వెళ్లిన సందర్భంలో కూడా ఓ అభిమాని ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు మెగా హీరోలంతా ఒకే వేదికపై కనిపిస్తారంటే ఫ్యాన్స్ ఏమాత్రం వెనక్కి తగ్గరు, దూసుకొచ్చేస్తారు. ఆ క్రౌడ్ ని తట్టుకోవడం ఎవరి వల్లా కాదు.
అందుకే వకీల్ సాబ్ ఫంక్షన్ ఇప్పుడు డైలమాలో పడింది. గెస్ట్ లు ఖరారు అయినా, హోస్ట్ లు డిసైడ్ అయినా.. ప్రేక్షకుల విషయమే తేలాల్సి ఉంది.