పేరుకు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి. తీరా ఆ సమితి తరుపున నిరసన చేసేందుకు వెళ్లింది కేవలం నలుగురు. వైఎస్ షర్మిల ఇంటి ముట్టడి పేరుతో నాటకానికి తెరలేపారు. అయితే అనుకున్నదొకటి, అయిందొకటి అనే చందాన సదరు ఆంధ్రప్రదేశ్ పరి రక్షణ సమితి నేతృత్వంలో చేపట్టిన వీధి నాటకం రక్తి కట్టించలేకపోయింది. పైగా వీపు విమానం మోదేలా దెబ్బలు తినాల్సి వచ్చిందని సంబంధిత వీడియోలు చెబుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని దివంగత వైఎస్సార్ తనయ షర్మిల ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో కొత్త పార్టీని నెలకొల్ప నున్న షర్మిల…. కృష్ణా జలాల విషయంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చారు.
ఇది ఆంధ్రప్రదేశ్ సమాజానికి నచ్చకపోవచ్చు. కానీ ఆమె తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్‌ను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె స్పష్టమైన స్టాండ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రయోజనాలు దెబ్బ తినేలా షర్మిల ట్వీట్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి చైర్మన్ కొలికిపూడి శ్రీనివాస్ నేతృత్వంలో బంజారా హిల్స్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిల ఇంటి ముట్టడికి యత్నించారు. ఈయనతో పాటు మరో ముగ్గురు అక్కడికి వెళ్లడం గమనార్హం.
షర్మిల అనుచరులతో శ్రీనివాస్ వాగ్వాదానికి దిగారు. దీంతో షర్మిల అనుచరులు జింతాకా జింతా అంటూ తమ మార్క్ ట్రీట్ మెంట్ ఇచ్చారని మీడియా కోడై కూస్తోంది. రోజుకొక పేరుతో మీడియాలో కొలికిపూడి శ్రీనివాస్ ప్రత్యక్షం కావడం చూస్తున్నాం. అది ఆయన ఇష్టం. బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిపై ఎల్లో చానల్ వేదికగా లైవ్‌లో దాడి చేయడంతో ఆయన పేరు ప్రధానంగా వినిపించింది. ఇంత వరకూ అమరావతి పరిరక్షణ సమితి పేరుతో రాజధాని కోసం పోరాడుతున్న వ్యక్తి ఉన్నట్టుండి…. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి చైర్మన్ కావడం గమనార్హం.
నిజంగా రాయలసీమకు అన్యాయం జరిగిందని సదరు సోకాల్డ్ పరిరక్షణ సమితి నాయకులు భావిస్తుంటే, కర్నూలుకు కనీసం హైకోర్టు కూడా ఇవ్వకుండా అడ్డుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే రాయలసీమకు సాగునీళ్లు అందుతాయనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అందుకు తగ్గట్టు జీవో తీసుకొచ్చారు. రాయలసీమకు సాగునీళ్లు ఇచ్చేందుకు కుదరదంటూ ప్రకాశం బ్యారేజ్‌పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వ రరావు నేతృత్వంలో ఆందోళన చేయడాన్ని సీమ సమాజం మరిచిపోలేదు.
వాస్తవాలు ఇలా ఉంటే, కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం రోజుకొక సంస్థ పేరుతో తెరపైకి వచ్చే అమరావతి పరిరక్షణ సమితి నాయకుడు… సీమ ప్రయోజనాల కోసం షర్మిల ఇంటిని ముట్టడించడానికి వెళ్లడం కంటే కామెడీ మరేదైనా ఉంటుందా? కనీసం నవ్వుకుంటారనే ఆలోచన కొరవడడం విడ్డూరంగా ఉంది. ప్రతిదీ నాటకాన్ని రక్తి కట్టించాలంటే కుదరదు.
ఎందుకంటే ప్రేక్షకులకు కూడా తెలివి తేటలుంటాయని గ్రహించలేకపోయారు. జనంలో చైతన్యం వచ్చింది. కానీ గత కొన్నేళ్లుగా తెలుగు సమాజంలో నాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఎల్లో బ్యాచ్, కాలంతో పాటు మారలేక, తమ కుట్రపూరిత ఆలోచనలను మార్చుకోలేద నేందుకు ఇదే నిదర్శనం.
నిజంగా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అలియాస్ అమరావతి పరిరక్షణ సమితి నాయకులు ఆవేదన చెందుతుంటే …హైదరాబాద్‌లో కేసీఆర్ ఉంటున్న ప్రగతిభవన్‌ను, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటిని, ఇతరత్రా పార్టీల కార్యాలయాలను, ఇళ్లను ముట్టడిస్తే ఏపీ సమాజం హర్షిస్తుంది. అలా కాకుండా అసలు పార్టీనే ఇంకా స్టార్ట్ చేయని షర్మిల ఇంటిని ముట్టడించడం వెనుక దురుద్దేశాలను పసిగట్టలేని స్థితిలో జనం లేరని గుర్తిస్తే మంచిది.
నిజంగా నాటకాలు అంతరిస్తున్నాయని ఆవేదన చెందే వారికి నిన్నటి షర్మిల ఇంటి ముట్టడి, ఆ భయాన్ని, ఆందోళనను పోగొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.