ఏపీ ఎన్నికల కమిషనర్ గా మాజీ సీఎస్ నీలం సాహ్నీ నియామకంపై కోర్టులో జరుగుతున్న విచారణలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరో కౌంటర్ దాఖలైంది. నీలం సాహ్నీ నియామకం సరికాదని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆమె నియామకం చెల్లదని పిటిషన్ పడింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు.
ఈ పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ ముఖ్యకార్యదర్శికి, ఎన్నికల సంఘం కార్యదర్శికి.. కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోపాలకృష్ణ ద్వివేదీ కౌంటర్ దాఖలు చేశారు.
సాహ్నీ నియామకం పూర్తిగా రాజ్యంగబద్ధంగా, గవర్నర్ విచక్షణ మేరకు జరిగిందని కౌంటర్లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించే సమయానికి సాహ్నీ ఎలాంటి ప్రభుత్వ హోదాల్లో లేరని పేర్కొన్నారు.
గతంలో న్యాయశాఖలో కార్యదర్శిగా పని చేస్తున్న ఒక వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించడంపై సుప్రీం కోర్టు స్పందించిందని, ప్రభుత్వ హోదాల్లోని వారు ఎస్ఈసీలుగా ఉండకూడదని తీర్పును ఇచ్చిందని, అయితే నీలం సాహ్నీ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆమె ఎలాంటి ప్రభుత్వ హోదాల్లో లేరని కౌంటర్లో పేర్కొన్నారట.
నీలం సాహ్నీ నియామకం సమయంలో వచ్చిన పత్రికల వార్తలను బట్టి చూస్తే.. ఏపీ ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లను గవర్నర్ కు పంపింది. వారిలో ఎవరినైనా ఎస్ఈసీగా నియమించవచ్చునని గవర్నర్ కు నివేదించింది. ఆయన తన విచక్షణాధికారం ప్రకారం.. నీలం సాహ్నీని ఎంపిక చేశారు. ఆ ఎంపిక ప్రకటనను చదివితే.. అందులో నీలం సాహ్నీకి ఒక షరతు కూడా ఉంది.
అప్పటికి ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉండిన ఆమె ఆ పదవిని వదులుకుంటే ఎస్ఈసీ గా బాధ్యతలు స్వీకరంచవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. పత్రికల్లో కూడా ఆ వివరాలు వచ్చాయి. ఆ తర్వాత నీలం సాహ్నీ సలహాదారు పదవికి రాజీనామా చేయడం, ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇదంతా పత్రికల్లో వార్తలు చదివిన వారికే స్పష్టత ఉన్న అంశం. ఈ వ్యవహారం ఇలా కోర్టుకు చేరడం కాస్త ఆశ్చర్యమే. ఇది ఇంకా ఎంత వరకూ వెళుతుందో!