తమిళనాడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ముందే కకావికలం అయిపోతుందనుకున్న అన్నాడీఎంకే ఎలాగోలా ఆ పెద్ద పరీక్షను దాటేసింది. ఈపీఎస్, ఓపీఎస్ ల సారధ్యంలో ఎన్నికలకు వెళ్లింది. ఓడిపోయినా, పరువును నిలబెట్టుకుంది. తను పరుగులో ఉన్నట్టే అని నిరూపించుకుంది. ఇదంతా ఒకరకంగా బీజేపీ చలువే అని చెప్పవచ్చు. బెదిరించో, బతిమాలో కమలం పార్టీ వాళ్లు అన్నాడీఎంకేను ఒక గాటన కట్టేయగలిగారు. లేకపోతే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే ప్రభుత్వం నిలబడేదే కాదేమో! శశికళ క్వీన్ మేకర్ గా నిరూపించుకుంది కానీ, ఆమె అప్పట్లో జైలుకు వెళ్లకుండా.. ఆమె కనుసన్నల్లో పాలన సాగి ఉంటే.. అన్నాడీఎంకే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టం.
ఆ గతమంతా గడిచిపోయినప్పటికీ.. ఇప్పుడు అన్నాడీఎంకేకు అంతర్గత రాజకీయం పెద్ద సంకటంగా మారే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందిన పార్టీగా అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలను నిర్వహించుకోవాల్సి ఉందట. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పూర్తి స్థాయిలో సంస్థాగత ఎన్నికలను నిర్వహించుకోలేదు. అన్నింటికీ మించి సుప్రిమోను ఎన్నుకోలేదు!
జయలలిత ఉన్న రోజుల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గా వ్యవహరిస్తూ వచ్చారు. మొత్తం ఏడు టర్ముల పాటు జయలలిత ఆ హోదాలో పార్టీకి నియంతలా సాగారు. జైలుకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై పన్నీరు సెల్వాన్ని పెట్టి వెళ్లిన జయ, పార్టీ గుత్తాధిపత్యాన్ని మాత్రం ఎప్పుడూ తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేకు ఇప్పటి వరకూ ప్రధాన కార్యదర్శి అంటూ ఎవరూ లేకపోవడం గమనార్హం. సీఎం సీట్లో కూర్చుని ఉండిన పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలు ఆ హోదా జోలికి వెళ్లలేదు. కేవలం కన్వీనర్, డిప్యూటీ కన్వీనర్ హోదాల్లో వారు కొనసాగారు. ప్రధాన కార్యదర్శి పదవి మాత్రం ఖాళీనే.
మరి ఆ పార్టీ అంతర్గత రాజ్యాంగం మేరకు అధినేత పదవి అలా ఖాళీగానే ఉంది. సీఈసీ వద్ద గుర్తింపు పొందిన పార్టీలు ఐదేళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలనే నియమం నేపథ్యంలో.. ఇప్పుడు అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పటికే గడువు ముగిసినా.. మరోసారి ఆరు నెలల సమయాన్ని కోరుతూ సీఈసీకి లేఖ రాసిందట ఆ పార్టీ. ఆ గడువు లభించడం లాంఛనమే అయినా.. కొత్త ప్రధానకార్యదర్శి విషయంలో అన్నాడీఎంకే ఏకగ్రీవ నిర్ణయానికి రాగలదా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.
పన్నీరు పట్టు విడిచే అవకాశాలు ఉండవు, ఏకులా వచ్చిన పళని మేకులా తయారయ్యారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే.. సర్దుబాట్లు తేలికే. కొట్టాడితే అధికారమే చేజారుతుందనే భయం ఉంటుంది. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహామహా పార్టీల్లోనే విబేధాలు రచ్చకెక్కుతూ ఉంటాయి. మరి ప్రధాన కార్యదర్శే లేని పార్టీలో… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ హోదాకు నేతను ఎన్నకోవడం తేలికైన విషయం అయితే కాదు!