తెలంగాణలో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతి వచ్చి చాలా రోజులు అయింది. ఆంధ్రలో ఇంకా తెరవలేదు కాబట్టి విడుదల కావడం లేదు. కానీ ఏవో ఒక సినిమాలు వేసి థియేటర్లు తెరచుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు సరికదా, తమ డిమాండ్లు తీరితేనే థియేటర్లు తెరుస్తాం అనే రేంజ్ లో ఎగ్జిబిటర్లు ముందుకు వెళ్లారు. పర్సంటేజ్ సిస్టమ్ కావాలని పట్టు పట్టారు.
కానీ గమ్మత్తుగా ఏ పర్సటేజ్ సిస్టమ్ కావాలనే డిమాండ్ కు తెరవెనుక మద్దతు ఇస్తున్నారని పేరు పడిన ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబునే తన కంట్రోల్ లో వున్న సినిమాలను ఓటిటి కి ఇచ్చేసారని వార్తలు వచ్చాయి. దీనికి తోడు మరో డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సుధాకరరెడ్డి తను నిర్మించిన మాస్ట్రో సినిమాను ఓటిటికి ఇచ్చేసారు. అల్లు అరవింద్ చేతిలో వున్న సినిమాలను కూడ ఓటిటి ఇచ్చేస్తున్నారని గ్యాసిప్ లు వచ్చేసాయి.
దీంతో ఎగ్జిబిటర్ సర్కిల్ లో కలవరం బయలుదేరింది. అర్జెంట్ గా ధియేటర్లు జూలై నెలాఖరు లోపుల తీసేస్తున్నాం అంటూ ఫీలర్లు బయటకు వదిలారు. ఈ మేరకు సమావేశాలు నిర్వహించారు. డిమాండ్లు పక్కన పెట్టి ముందు థియేటర్లు ఓపెన్ చేయడం మీదనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాలు ఓటిటికి ఇవ్వడం అలవాటైతే థియేటర్ల భవిష్యత్ అయోమయంలో పడుతుంది,
ఆంధ్రలో థియేటర్లు ఎప్పటి నుంచి తెరుస్తారన్న క్లారిటీ లేదు. 10 నుంచి థియేటర్లకు అనుమతి ఇస్తారని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే జూలై 15 నుంచి థియేటర్లు తెరిచే అవకాశాలు పరిశీలిస్తున్నారు. కానీ అలా ఓపెన్ చేస్తే జనాలు వస్తారా? రారా? థర్డ్ వేవ్ భయం ఎంత వరకు వుంటుంది అన్న ఆలోచనలు సాగుతున్నాయి.
అన్నింటికి మించి ఆంధ్రలో టికెట్ రేట్ల పెంపు అన్నది ఇప్పట్లో వుండేలా కనిపించడం లేదు. అలా అయితే ధియేటర్లు తెరచినా సినిమాలు విడుదలవుతాయా? అన్నది ఓ అనుమానం. సినిమాలు విడుదలయినా, లీజు రేట్లు అలాగే వుంటాయా? అన్నది మరో అనుమానం. థియేటర్ల నిర్వహణ కిట్టుబాటు అవుతుందా? అన్నది ఇంకా పెద్ద అనుమానం.
ఇలాంటి నేపథ్యంలో టోటల్ గా ఎగ్జిబిటర్ల వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతున్నట్లు కనిపిస్తోంది. ఓటిటి సంస్థలు పెద్ద సినిమాలకు మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. చిన్న సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. గీసి గీసి బేరాలు ఆడుతున్నాయి. అందువల్ల పెద్ద సినిమాలు టెంప్ట్ అయి ఓటిటికి వెళ్లి, చిన్న సినిమాలు మిగిలితే థియేటర్లకు ఏమి లాభం?
ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే మంచి మంచి సెంటర్లలో వున్న థియేటర్లు షాపింగ్ కాంప్లెక్స్ లుగా మారిపోవడానికి ఎంతో కాలం పట్టదు.