మ‌మ‌తా బెన‌ర్జీ, మోడీ..మామిడిపండ్ల‌ దౌత్యం!

ఉప్పు నిప్పులా సాగుతున్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, బెంగాల్ సీఎం మమ‌తా బెనర్జీ. వేర్వేరు రాజ‌కీయ పార్టీల నేత‌లు అయిన వీళ్లు కీల‌క హోదాల్లో.. ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నా అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఎన్నిక‌లు…

ఉప్పు నిప్పులా సాగుతున్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, బెంగాల్ సీఎం మమ‌తా బెనర్జీ. వేర్వేరు రాజ‌కీయ పార్టీల నేత‌లు అయిన వీళ్లు కీల‌క హోదాల్లో.. ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నా అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఎన్నిక‌లు అయిపోయినా పాత వైర‌మే కొన‌సాగుతూ ఉంది. ఈ వైరంలో వెస్ట్ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ కూడా త‌న పాత్ర‌ను వ‌హిస్తూ ఉన్నారు.

ఇక బెంగాల్ సీఎస్ విష‌యంలో అయితేనేం.. ఇత‌ర వ్య‌వ‌హారాల్లో అయితేనేం.. కేంద్రం కూడా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంది. కేంద్రానికి, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మ‌ధ్య ఏం జ‌రిగినా.. రాజ‌కీయ‌మే అవుతోంది. ర‌చ్చ‌ర‌చ్చ అవుతోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌మ‌తా బెనర్జీ వైపు నుంచి ఒక సానుకూల ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి బెంగాల్ మామిడిపండ్ల‌ను పంచించారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి. ప్ర‌ధాన‌మంత్రితో పాటు.. రాష్ట్ర‌ప‌తికి, ఉప‌రాష్ట్ర‌ప‌తికి, కాంగ్రెస్ నేత సోనియాగాంధీకి, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కు, కేంద్ర‌హోం మంత్రి అమిత్ షా, మ‌రో కేంద్ర‌మంత్రి రాజ్నాథ్ సింగ్ ల‌కు త‌మ రాష్ట్రంలో పండే ప్ర‌త్యేక ర‌కం మామిడి పండ్ల‌ను పంపించార‌ట మ‌మ‌త‌. ఇలా ఢిల్లీలోని ప్ర‌ముఖుల‌కు మ‌మ‌త పంపించిన మామిడిపండ్లు ప్ర‌త్యేకంగా వార్త‌ల్లో నిలుస్తున్నాయి.

ప్ర‌త్యేకించి త‌న‌ను ముఖ్య‌మంత్రి పీఠం నుంచి దించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హోరెత్తించిన మోడీ, షాల‌కు మ‌మ‌త మామిడిపండ్ల‌ను పంపించ‌డం మ‌రింత ప్ర‌త్యేకం అయ్యింది. రాజ‌కీయాలు ఎన్ని ఉన్నా.. ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి హోదాలు.. స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

అయితే, మోడీ- మమ‌త ల మ‌ధ్య‌న ఆ స‌మ‌న్వ‌యం కూడా ప్ర‌శ్నార్థ‌కం అనుకున్న త‌రుణంలో.. మ‌మ‌త త‌న వంతుగా మామిడి పండ్ల దౌత్యాన్ని పంపిన‌ట్టుగా ఉంది. ఆ తీయ‌ని మామిడి పండ్లు అయినా.. వీరి మ‌ధ్య అధికార స‌మ‌న్వ‌యాన్ని ఏర్ప‌రుస్తాయ‌ని బెంగాళీలు ఆశిస్తున్నారేమో!