ఈనాడులో ఓ చిన్న ఫొటో, మూడు లైన్ల వార్త. వ్యాక్సినేషన్‌లో జగన్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిన వైనాన్ని చాటి చెప్పాయి. ఏపీ ప్రజానీకానికి టీకాలు వేయించడంలో జగన్ సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తోందనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలకు “ఈనాడు” చక్కటి కౌంటర్ ఇచ్చిందని చెప్పొచ్చు. డబ్బు చెల్లించకుండానే టీకాలు ఎలా తెస్తారు? వేస్తారు? అనే చంద్రబాబు ప్రశ్నలకు …ఈ చిన్న వార్తే దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.
“పొలం గట్టున వ్యాక్సినేషన్! ” అనే శీర్షికతో చిన్న వార్తను ఈనాడు క్యారీ చేసింది. ఓ గిరిజన మహిళకు వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్న ఫొటోతో పాటు అందుకు సంబంధించిన వివరాలను మూడే మూడు వాక్యాల్లో రాశారు. కానీ ఈ ఫొటో, ఆ సమాచారం అర్థం చేసుకున్న వాళ్లకు చేసుకున్నంతగా అన్నట్టుగా ఉంది. ఆ సింగిల్ కాలమ్ వార్త ఎలా సాగిందంటే…
“విశాఖ మన్యంలోని ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మ పంచాయతీలో బుధవారం కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం ఏర్పాటు చేశారు. టీకా వేసుకునేందుకు గిరిజనులు భయపడి పొలం పనులకు వెళ్లిపోయారు. కార్యక్రమ పర్యవేక్షణకు వచ్చిన ఎంపీడీవో కుమార్ విషయం గ్రహించి, పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. చివరికి 61 మందికి టీకా వేయించారు”
ఇది పేదలు, గిరిజనులు, దళితులు, ఇతర అణగారిన వర్గాల ప్రజల ఆరోగ్యం విషయంలో జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి. వ్యాక్సినేషన్ వేసుకుంటే ఏదో అవుతుందనే భయంతో దూరంగా ఉండిపోయిన సంగతిని ఎంపీడీవో కుమార్ క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుసుకున్నారు.
పొలాల్లో పనులు చేసుకుంటున్న గిరిజన మహిళల వద్దకు నేరుగా ఆయనే వెళ్లి టీకా ప్రక్రియ ఉద్దేశాన్ని వారికి వివరించారు. వారిలోని అపోహలను, భయాలను పోగొట్టారు. ఆ తర్వాత 61 మందికి టీకా వేయించి తన కర్తవ్యాన్ని, ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటి చెప్పారు.
ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియే చేపట్టలేదనే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, ఇతర టీడీపీ నాయకులకు విశాఖ మన్యం లోని ఈ ఘటనే దీటైన సమాధానం చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై అవాకులు చెవాకులు పేలే వాళ్లకు ఈ ఫొటో ఒక్కటే చాలు ప్రతిపక్షాల నోళ్లు మూయించడానికనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంచి సందే శాన్ని ఇచ్చేలా సరైన సమయంలో సరైన వార్తను ప్రచురించిన ఈనాడు అభినందనలు అందుకుంటోంది.