రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇంత రచ్చ జరుగుతున్నా.. ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం రాష్ట్రం తరపున, రాష్ట్ర ప్రయోజనాల కోసం పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. కరోనా మరణాల లెక్కలు తేల్చాలంటూ వితండవాదం చేస్తున్న చంద్రబాబుకి, కనీసం కళ్లముందున్న రాయలసీమ ఎత్తిపోతల సమస్య కనిపించడం లేదా. అటు శ్రీశైలం డ్యామ్ నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తున్న జలచౌర్యం కనపడలేదా? అన్నీ తెలిసి కూడా తేలు కుట్టిన దొంగలా మారిపోయారు చంద్రబాబు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది వైఎస్ జగన్ మానసపుత్రిక. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వచ్చే నీరు కాకుండా.. దానికి అదనంగా సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పేరుతో 3 టీఎంసీల కృష్ణానది వరదనీటిని సద్వినియోగం చేసుకునే పథకం ఇది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన అన్ని పనులు చకచకా జరిగిపోయాయి.
ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాయలసీమలో టీడీపీకి నామరూపాలు ఉండవనే ఉద్దేశంతో చంద్రబాబు కొర్రీలు వేయాలని చూశారు. పర్యావరణ అనుమతులు లేవని, తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆ ప్రాంత నేతల్ని పరోక్షంగా రెచ్చగొట్టారు. దీంతో కొన్నాళ్లు రాయలసీమ ఎత్తిపోతలపై న్యాయవివాదం ముసురుకుంది.
ఆ అడ్డంకులన్నీ దాటి, కరోనా కష్టకాలం తర్వాత తిరిగి పనులు మొదలవుతున్నాయన్న దశలో మరోసారి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి అడ్డు తగులుతోంది. ఓవైపు రాయలసీమ ఎత్తిపోతల వద్దంటూనే, మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి జలవిద్యుత్ పేరుతో నీటిని తరలించుకుపోతోంది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని తీవ్రంగా ఖండించిన ఏపీ కేబినెట్, ప్రధాని మోదీకి లేఖ రాస్తోంది. అయితే ఏపీలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉంది.
టీడీపీ కిం కర్తవ్యం..?
రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటించే చంద్రబాబుకి.. రాయలసీమ అంటే మొదటినుంచీ గిట్టదు. సీమ నుంచి వచ్చిన చంద్రబాబు.. తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే రెండు జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు. ఆ ప్రాంతాల అభివృద్ధి కోసమే కృషిచేశారు. రాయలసీమను పూర్తిగా పట్టించుకోలేదు.
ఇప్పుడు జగన్ ఎత్తిపోతల పథకం ద్వారా సీమను సస్యశ్యామలం చేస్తుండే సరికి బాబు మైండ్ బ్లాక్ అయింది. తనకి సాధ్యం కాని పనిని, జగన్ చేసి రాయలసీమలో హీరో అవుతున్నారని బాబుకి కడుపుమంట. అందుకే ఆయన ఈ విషయంపై నోరు మెదపడం లేదు.
అనుకూలంగా మాట్లాడితే..?
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుకూలంగా మాట్లాడితే జగన్ ని చంద్రబాబు ఇంకా పెద్ద హీరోను చేసినట్టే. పక్కరాష్ట్రం అడ్డుపడుతున్నా జగన్ పనులు ఆపకుండా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని ఒప్పుకున్నట్టే.
చంద్రబాబు అనుకూలంగా మాట్లాడి, చివరకు ప్రాజెక్ట్ సక్సెస్ అయితే క్రెడిట్ అంతా జగన్ కే వెళ్లడం ఖాయం. మరోవైపు తెలంగాణ నుంచి కూడా వ్యతిరేకత మొదలవుతుంది. తెలంగాణలో ఆల్రెడీ పతనం అంచున ఉన్న టీడీపీ పూర్తిగా మునగడం ఖాయం.
వ్యతిరేకంగా మాట్లాడితే..?
పోనీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అనుమతులు లేకుండా కట్టాలనుకోవడం తప్పు అని చంద్రబాబు సుద్దులు చెప్పినా అది కూడా ఆయనకు ఇబ్బందికర పరిణామమే.
సీమ నీటి కోసం ఆమాత్రం ధైర్యం చేయలేని చంద్రబాబు, ఇప్పుడు జగన్ పై పడి ఏడుస్తున్నారని ఈసడించుకుంటారు ప్రజలు. అందుకే బాబు ఈ ఆపరేషన్ కి దూరంగా ఉన్నారు