ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు ఎస‌రు!

హైద‌రాబాద్‌లో తెలుగుదేశం పార్టీ కార్యాల‌యం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లీజు ర‌ద్దు చేయ‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇదే అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో…

హైద‌రాబాద్‌లో తెలుగుదేశం పార్టీ కార్యాల‌యం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లీజు ర‌ద్దు చేయ‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇదే అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో ప‌ని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పేరిట వెలువ‌డిన లేఖ క‌ల‌క‌లం రేపుతోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్ చేస్తే… ఏ విధంగా అమ‌లు చేస్తారో తెలిసిన వారంతా, ఇది ముమ్మాటికీ ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లీజు ర‌ద్దు ఎత్తుగ‌డ‌లో భాగంగానే చూడ‌డం గ‌మ‌నార్హం.  

ట్రస్ట్‌ పేరుతో లీజుకు తీసుకున్న స్థలంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదనే విష‌యాన్ని ప్ర‌భుత్వ దృష్టికి స‌ద‌రు లేఖ ద్వారా తీసుకెళ్లారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ట్రస్ట్‌ భవన్‌ లీజును రద్దు చేసి త‌మ‌కు ఆ కార్యాలయంలోనే మెరుగైన వేతనాలతో పనిచేసే అవకాశం కల్పించాల‌ని కోర‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో టీడీపీని కేసీఆర్ ఖాళీ చేశారు. కేసీఆర్ పంచ‌న ఇమ‌డ‌లేమ‌ని అనుకున్న టీడీపీ నేత‌లు కాంగ్రెస్ లేదా బీజేపీని ఎంచుకున్నారు. ఇక పార్టీనే లేన‌ప్పుడు, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ దేనిక‌నే భావ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌రంప‌ర‌లో తెర‌పైకి వ‌చ్చిందే తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పేరిట లేఖ అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇటీవ‌ల ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌టికి పంపేందుకు కేసీఆర్ అనుస‌రించిన వ్యూహాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. అసైన్డ్ భూమిని కొనుగోలు చేయ‌డంతో పాటు ఆక్ర‌మించార‌నే ఫిర్యాదుల‌ను చేయించ‌డం, ఆ వెంట‌నే మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం అంతా రెండు రోజుల్లో జ‌రిగిపోయింది. ఆ త‌ర్వాత స‌హ‌జంగానే టీఆర్ఎస్ నుంచి త‌న‌కు తానుగా ఈట‌ల బ‌య‌టికి వెళ్లే ప‌రిస్థితిని కేసీఆర్ ప్ర‌భుత్వం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వానికి ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లోని తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పేరిట లేఖ రాయ‌డం టీడీపీ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం లెటర్‌ప్యాడ్‌పై ‘తెలంగాణ ఆత్మగౌరవ లేఖ’ పేరిట రాసిన ఆ లేఖ‌లోని ప్ర‌స్తావించిన ముఖ్య‌మైన అంశాల‌ను ప‌రిశీలిద్దాం.

‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అయిన ఎన్టీఆర్‌ భవన్‌లో 15 ఏళ్లుగా పని చేస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వారి పెత్తనం కొనసాగుతోంది. ట్రస్ట్‌ భవన్‌ నిర్వహణ అంతా ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. తెలంగాణ నేతలకు పదవి తప్ప పవర్‌ ఉండదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణకు కూడా ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులపై అజమాయిషీ ఉండదు. దశాబ్దాలుగా పని చేస్తున్నా మ‌మ్మ‌ల్ని ట్రస్ట్‌ భవన్‌ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. పీఎఫ్, ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు లేవు. కనీసం ఉద్యోగులకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తీసి వేసినా ఎలాంటి ఆధారాల్లేకుండా చేశారు.

ఇన్నాళ్లు రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్న ఈ ట్రస్ట్‌ భవన్‌ను ఇప్పుడు పరిస్థితులు బాగాలేక పోవడంతో ఆర్థిక వనరుగా, వ్యాపార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రైవేట్‌ హోటల్, క్యాంటీన్‌ నడుస్తున్నాయి. ప్రైవేట్‌ కాల్‌సెంటర్‌కు అద్దెకు ఇచ్చారు’అని రాసుకొచ్చారు.

ఈ లేఖ‌లో ప్ర‌స్తావించిన తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ నేడో రేపో టీఆర్ఎస్‌లో చేరుతార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. శుభ‌ముహూర్తం కోసం ఆయ‌న ఎదురు చూస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో  ర‌థ‌సార‌థి లేని పార్టీగా టీడీపీ మిగ‌ల‌నుంది. 

వ్యాపార కార్య‌క‌లాపాల‌కు వినియోగిస్తున్నార‌నే కార‌ణంతో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌నే అనుమానాలు తెలుగుదేశం పార్టీలో బ‌లంగా ఉన్నాయి. ఈ లేఖ వెనుక బ‌ల‌మైన వ్యూహం ఉంద‌ని టీడీపీ భావిస్తోంది. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ సంగ‌తేంటో త్వ‌ర‌లో తేలే అవ‌కాశం ఉందంటున్నారు.