ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలసీ మారుతోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాల అమలుపైనే పూర్తిగా దృష్టి సారించారు. జగన్ అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ, కరోనా మహమ్మారి పంజా విసిరింది. ఇంతటి విపత్తులోనూ సంక్షేమ పథకాల అమలును విజయవంతంగా నడుపుతున్న ఘనత ఒక్క జగన్ సర్కార్కే దక్కింది.
మరోవైపు సంక్షేమం తప్ప మరే అభివృద్ధి పనులు చేపట్టడం లేదనే విమర్శలను జగన్ సర్కార్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి, అలాగే ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడంతో పాటు సాఫ్ట్వేర్ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు, ఇతర రంగాల్లో కూడా వేలాది పెట్టుబడులు పెట్టేందుకు పలు పెద్ద పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో జగన్ పాలనలో పాలసీ మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో భవిష్యత్‌పై ఆశ కలిగించే పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో రూ.11,239.16 కోట్ల పెట్టుబడితో కొత్తగా ఏడు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమల ద్వారా కొత్తగా ప్రత్యక్షంగా 17,334 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ రూ.7,500 కోట్ల పెట్టుబడి, నాయుడుపేటలో రూ.627 కోట్లతో గ్రీన్‌టెక్ విస్తరణ, విశాఖలో సెయింట్ గోబియాన్ రూ.2,001 కోట్ల పెట్టుబడి, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో రూ.401 కోట్లతో ‘పిట్టి’ ప్రాజెక్టు, అక్కడే నీల్ కమల్ రూ.486 కోట్లతో పరిశ్రమ పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. ఇవే కాకుండా మరికొన్ని పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో అంగీకారానికి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇక జగన్ పాలనకు మూడేళ్ల కాలం మిగిలి వుంది. ఈ మూడేళ్లలో సాధ్యమైనంత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలను ఆకర్షించే పాలసీలను జగన్ ప్రభుత్వం తీసుకొస్తోంది. తాజాగా ఐటీ రంగాన్ని ఏపీలో బలోపేతం చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ రంగంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా భారీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తూ 2021–24 ఐటీ పాలసీని రూపొందించింది. విశాఖలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు.
ఈ టెక్నాలజీ పార్కులో ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ల్యాబ్స్, కో–వర్కింగ్ స్పేస్, స్టేట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలు, కోవర్కింగ్ ప్లేస్‌లను అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చేసే కాన్సెప్ట్ సిటీలు, ఐటీ పార్కులకు అనుమతులు త్వరితగతిన ఇచ్చే విధంగా పలు చర్యలు తీసుకున్నారు.
ముఖ్యంగా ఐటీ రంగంలో మహిళలు, వెనుకబడిన సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ పాలసీలో ప్రత్యేక రాయితీలను ప్రకటించడం విశేషం. బహుశా ఈ కోణంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించిన దాఖలాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీలు కల్పించే ప్రతి స్థానిక ఉద్యోగికి వార్షిక ఆదాయంలో 15 శాతం రాయితీగా అందిస్తారు. హైఎండ్ జాబ్ కల్పిస్తే గరిష్టంగా రూ.1,50,000, మిడ్ లెవల్ జాబ్‌కు రూ.1,12,500, ఎంట్రీ లెవల్ జాబ్‌కు రూ.75,000 వరకు చెల్లిస్తారు. మిగతా ఐటీ కంపెనీలకు ఈ రాయితీ 10 శాతంగా ఉంది.
దీంతో పాటు పారిశ్రామిక విద్యుత్ రాయితీ, ప్రతి ఉద్యోగికి నెలకు రూ.500 చొప్పున రెండేళ్ల పాటు గరిష్టంగా ఒక సంస్థకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. స్థానిక ఉద్యోగికి అవసరమైన నైపుణ్య శిక్షణకు ఉద్యోగికి రూ.10,000 ఒకసారి చెల్లిస్తారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ నిధిని ఏర్పాటు చేస్తారు. క్వాలిటీ సర్టిఫికేషన్ కోసం అయ్యే వ్యయంలో 50 శాతం చొప్పున గరిష్టంగా ఒక సంస్థకు రూ.5 లక్షల వరకు రాయితీ అందిస్తారు.
అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, గిగ్ ఎకనామీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పాలసీలో ప్రత్యేక రాయితీలు ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పని చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకోవడానికి వన్‌టైమ్ ఇన్సెంటివ్ కింద రూ.20,000 అందిస్తారు.
అదే విధంగా సొంతంగా ఐటీ కాంట్రాక్టులు తీసుకొని పనిచేసే గిగ్ వర్కర్లకు హార్డ్‌వేర్ కొనుగోళ్లలో 50 శాతం.. గరిష్టంగా రూ.20,000 వరకు రాయితీ అందిస్తారు. గిగ్ వర్క్ర్ కనీస వార్షిక టర్నోవర్ రూ.3,00,000 ఉన్న వారికే ఈ రాయితీ లభిస్తుంది. పారిశ్రామిక విధానంలో జగన్ సర్కార్‌లో వచ్చిన మార్పునకు ఈ పెట్టుబడులు ప్రతిబింబిస్తున్నాయని చెప్పొచ్చు.
జగన్‌ను అభిమానించే వాళ్లు కూడా ప్రభుత్వంలో ఈ పాలసీని ఆశిస్తుండటంతో పాటు ఆహ్వానిస్తున్నారు. మూడో ఏడాదిలో జగన్ సర్కార్ అడుగు పెట్టిన పరిస్థితిలో సంక్షేమ పథకాల అమలుతో పాటు పరిశ్రమల స్థాపన, భారీ పెట్టుబడులను పెట్టేలా పాలసీలను రూపొందించడం జగన్ సర్కార్ పాలసీలో వచ్చిన మార్పునకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇదే ఒరవడి మరింత బలంగా కొనసాగాల్సి వుంది.