ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా ది గాడ్ ఫాదర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. 'keep your friends close and your enemies closer' అని! గాడ్ ఫాదర్ కోట్స్ లో ఇది బాగా పాపులర్ కూడా! మిత్రులు, శత్రువులతో ఎలాంటి సంబంధాలను మెయింటెయిన్ చేయాలనే అంశంపై ఒక మాఫియా డాన్ తన తనయుడికి ఇచ్చే సలహా అది.
భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలు, శత్రుపక్షాలతో వ్యవహరించే తీరును గమనిస్తే… గాడ్ ఫాదర్ కోట్ గుర్తుకు వస్తుంది. బీజేపీ దాన్ని పాటిస్తోందని అనలేం కానీ, బీజేపీతో రాజకీయ శత్రుత్వాన్ని మెయింటెయిన్ చేసే పార్టీలు, అదే సమయంలో మిత్రపక్షాలుగా చలామణి అవుతున్న పార్టీలు కూడా తలపట్టుకుంటున్నాయి!
బీజేపీతో ఒక్కసారి దోస్తీకి దిగి ఆ తర్వాత దాన్ని వదిలించుకున్నా, అతిగా అతికించుకున్నా.. తలపోటే తప్ప మరో దారి వాటికి కనిపించడం లేదు! మిత్రపక్షాల శక్తిని కూడా తనలోకి ఇముడ్చుకోవడం కాదు, ఆ పార్టీలనే నామరూపాలు లేకుండా చేయడానికి బీజేపీ వెనుకాడుతున్నట్టుగా లేదు. అధికారం లో భాగస్వామ్యాన్ని ఇచ్చినట్టే ఇచ్చి బీజేపీ వాటిని భ్రష్టు పట్టించడానికి వెనుకాడుతున్నట్టుగా లేదు!
శివసేనకు ఇదే అనుభవం అయ్యింది. ఎల్జేపీ పరిస్థితీ అదే! ముందే మేలుకున్నాడో ఏమో నితీష్ కుమార్ బీజేపీతో బంధాన్ని తెంచుకున్నాడు. ఇక తమిళనాడు పార్టీ అన్నాడీఎంకే బీజేపీతో ఎలా డీల్ చేయాలో తెలియక పిల్లిమొగ్గలు వేస్తోంది. జయలలిత మరణం తర్వాత దిక్కూదివాణం లేకుండా పోయిన ఆ పార్టీ బీజేపీ ఆటలో పావుగా మారింది. బీజేపీ అండతో కొన్నాళ్లు అధికారాన్ని నిలుపుకున్నా.. అన్నాడీఎంకేను అరిగించేసుకుని తను తమిళనాట బలోపేతం కావాలనే దురాశతో ఉంది బీజేపీ. ఇది సాధ్యం కావడం లేదు. దీంతో బీజేపీతో మితృత్వం ఇప్పుడు అన్నాడీఎంకు తలనొప్పే తప్ప మరో ఉపయోగం లేదు.
రెండున్నరేళ్ల కిందట జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ- శివసేనలు మిత్రపక్షాలే! అప్పుడు రెండు పార్టీలూ కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. సీఎం పీఠాన్ని ఇవ్వకపోయినా.. శివసేన ఫ్యామిలీ పాలిటిక్స్ కు అయితే ఇబ్బంది లేదు! అయితే శివసేనను బీజేపీ అవమానించని తీరంటూ లేదు! సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయినా.. శివసేనను తగు రీతిన గుర్తించడానికి బీజేపీ ససేమేరా అంటూ వచ్చింది. దీంతో.. సేనకు చిర్రెత్తి కాంగ్రెస్ , ఎన్సీపీలతో చేతులు కలిపింది.
సీఎం పదవిని పొందింది. మరి ఆ పార్టీ ప్రజా వ్యతిరేకతను పెంచుకుని దెబ్బతింటుందిలే అంటూ బీజేపీ ఏమీ వేచి చూడలేదు! ఆ ప్రభుత్వాన్ని కూలదోసేదాకా నిద్రపోలేదు! మిత్రపక్షంగా ఉండీ శివసేనను అవమానించింది. శత్రువుగా చేసుకుని.. మరింత దెబ్బేసింది.
ఇక మోడీకి నిరంతరాయంగా జై కొడుతూ వచ్చాడు రామ్ విలాస్ పాశ్వాన్. ఆయన మరణించాకా ఆయన తనయుడు కూడా అదే పని చేశాడు. అయితే.. కమలం పార్టీ మాత్రం పాశ్వాన్ ల విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఎల్జేపీలో చేరిక వర్గంతో రాజీ చేసి.. కలిసిమెలసి ఉండమని చెప్పలేదు! చీలిక వర్గాన్ని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంది. ఎలాగూ చీలిక వర్గం ప్రజాదరణ కోల్పోతుంది. అసలు వ్యక్తికి చిహ్నం దక్కదు. ఈ పార్టీ కాలగర్భంలోకి కలిసిపోతుంది.
బహుశా శివసేన విషయంలోనూ బీజేపీ వ్యూహం ఇదే కావొచ్చు. చీలికవర్గానికి వచ్చే ఎన్నికల్లో పెద్దగా సీట్లు ఇవ్వరు. లేదా.. విలీనం చేసుకున్నాం పో! అన్నా దిక్కులేదు! గుర్తు, పార్టీ గుర్తింపు చీలిక వర్గానికి దక్కితే బహుశా జరిగేది అదే!
ఈ వ్యవహారాలకు జడిసి నితీష్ కుమార్ అలర్ట్ అయినట్టుగా ఉన్నాడు. మరి నితీష్ ను బీజేపీ అంత తేలికగా వదలకపోవచ్చు. మిత్రుడిగా ఉన్నప్పుడే నితీష్ రాజీనామా వరకూ వచ్చారు. మరి జేడీయూలో చీలిక తీసుకురావడం కమలం పార్టీ తదుపరి కసరత్తు కావొచ్చు. మరి ఇది జరిగే అవకాశం ఉన్నా.. నితీష్ ఆ నిర్ణయం తీసుకున్నాడంటే, బీజేపీకి మిత్రుడిగా ఉండటం కంటే.. శత్రువుగా ఉండటమే మేలనుకున్నాడేమో!