విశాఖ చుట్టూ రాజకీయాలు తిరిగేలా జగన్ స్కెచ్ వేస్తున్నారు. వచ్చే ఎన్నికలు అమరావతి చుట్టూ జరిగితే చంద్రబాబుకు లాభం. అదే ఉత్తరాంధ్రా వంటి వెనకబడిన జిల్లాల వైపు నుంచి పొలిటికల్ డిబేట్ సాగితే కచ్చితంగా టీడీపీ డిఫెన్స్ లో పడుతుంది. అదే వైసీపీకి కావాల్సింది.
అందుకే జగన్ చలో విశాఖ అంటున్నారు. విశాఖ రాజధాని అని పదే పదే వైసీపీ నేతలు కూడా ప్రకటనలు ఇస్తున్నారు. ఉత్తరాంధ్రా రేపటి ఎన్నికల్లో సీఎం కుర్చీ పట్టేందుకు తురుపు ముక్క అన్నది కూడా రాజకీయ చాణక్యుడైన చంద్రబాబుకు తెలియని విషయం కాదు.
అలాగని ఆయన విశాఖ మన రాజధాని అని చెప్పలేరు. అందుకే చంద్రబాబు విశాఖ మీద అమిత ప్రేమను మాటలలో కాకుండా చేతలలో చూపించనున్నారని చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విశాఖ నుంచి పోటీ చేస్తారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అలా పోటీ చేయడం ద్వారా ఉత్తరాంధ్రాను టీడీపీ వైపు తిప్పుకునేందుకు బాబు ప్రయత్నం చేస్తున్నారుట.
ఇక పోతే జగన్ వేవ్ లో 2019 ఎన్నికల్లో కూడా విశాఖలో నాలుగు సీట్లు టీడీపీ గెలిచింది. దాంతో టీడీపీకి సేఫెస్ట్ జోన్ అంటే విశాఖే అని కూడా బాబు భావిస్తున్నారని భోగట్టా. విశాఖలో బాబు పోటీ చేస్తే ఏ సీటు నుంచి అన్నదే చూడాలి. దానికి రివర్స్ ప్లాన్ వైసీపీ ఏం వేస్తుందో కూడా ఆలోచించాలి.
విశాఖ రాజధాని ఏమిటి అన్నీ నేనే చేస్తాను అని రేపటి రోజున బాబు ఇక్కడ పోటీ చేస్తూ చెబితే వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.