కర్ణాటక లో భారతీయ జనతా పార్టీ వ్యవహారం పక్కా కాంగ్రెస్ రీతిన మారిపోయింది. సీట్లో ఎవరు కూర్చున్నా.. వారి తీరును వ్యతిరేకిస్తూ సన్నాయి నొక్కులు నొక్కే నేతలు సాధారణంగా కాంగ్రెస్ లో ఉంటారు.
కర్ణాటక బీజేపీ పరిస్థితి అంతకన్నా గొప్పగా ఏమీ లేదు! ఆ మధ్య కాంగ్రెస్ నుంచి బీజేపీ చాలా మంది ఎమ్మెల్యేలను తెచ్చుకుంది. వారు అంతా గమ్మున ఉన్నారు కానీ, బీజేపీ సీనియర్లు మాత్రం సీఎం సీట్లో కూర్చున్న వారిపై అసంతృప్త స్వరాలను వినిపిస్తూనే ఉన్నారు.
యడియూరప్ప పైనే అధిష్టానానికి బోలెడు ఫిర్యాదులు వెళ్లాయి. ఆయనను మారుస్తారంటూ ముందే కమలం పార్టీ నేతలు మీడియాతో చెప్పుకొచ్చారు. యడియూరప్పను దించేసే వరకూ వారు నిద్రపోలేదు. మరి ఆయనను దించేసి అధిష్టానం బొమ్మైని సీఎంగా చేసింది.
ఢిల్లీ చుట్టూ తిరగడమే సరిపోతూ ఉన్నట్టుంది బొమ్మైకి. చీటికీమాటికీ ఢిల్లీ వైపు చూడటం మినహా ఆయనకు మరో మార్గం లేదనే విశ్లేషణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నాటికి మరోసారి సీఎం మార్పు ఉండవచ్చంటూ మళ్లీ కమలం పార్టీ నేతలే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు!
ఇంకో ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అంత వరకూ కూడా బొమ్మైని సీట్లో కూర్చోబెట్టరని, మరొకరితో బీజేపీ అధిష్టానం ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు కమలనాథులే. ఇప్పటి వరకూ బొమ్మైకి ఎలాంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇలాంటి నేపథ్యంలో.. మరోసారి సీఎం మార్పు అంటే అది మరీ ఆశ్చర్యపోయే అంశం కాదనుకోవాలి!
అయితే అసలు ఆశ్చర్యం ఏమిటంటే.. యడియూరప్ప సన్నిహితురాలు శోభా కరంద్లాజే కు సీఎం పదవి ఛాన్సుందనేది! ఏదో యడియూరప్ప ఇమేజ్ తో ఆమె రాజకీయాల్లో వెలుగుతుంటారనే టాక్ ఉంది తప్ప, ఆమె నిజంగా సీఎం క్యాండిడేటా? అని అనేక మంది ఆశ్చర్యపోతున్నారు.
యడియూరప్ప వెంట శోభ రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఆయన బీజేపీని వీడినప్పుడు ఆమె వీడారు.మళ్లీ ఆయన చేరినప్పుడు చేరారు. యడియూరప్పకు అత్యంత సన్నిహితురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆయన హవాతోనే ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. బీజేపీ హైకమాండ్ ఏమో యడియూరప్పనే పక్కన పెట్టేసింది. అలాంటిది ఆమెకు ఇప్పుడు సీఎం పదవి అంటే.. అది గాసిప్ మాత్రమే అనుకోవాలి!