బిహార్ లో నితీష్ కుమార్ మరోసారి ప్లేటు ఫిరాయించారు. అయితే నితీష్ కు ప్లేటు ఫిరాయించడం కొత్త కాదు. వివిధ సందర్భాల్లో ఎన్డీయే లోపల, ఎన్డీయే బయట.. అన్నట్టుగా నితీష్ కుమార్ రాజకీయం కొనసాగింది.
మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా వ్యతిరేకించిన వారిలో ముందు వరసలో ఉంటారు నితీష్ కుమార్. అయితే ఆ తర్వాత మోడీ మంత్రి వర్గంలో జేడీయూ భాగస్వామి అయ్యింది. కానీ తమకు ప్రాధాన్యత దక్కలేదంటూ ఎన్డీయే నుంచి తన పార్టీని బయటకు తీసుకు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ బీజేపీతో చేతులు కలిపాడు. ఇప్పుడు మరోసారి తెగదెంపులు చేసుకున్నాడంతే!
అయితే ఎప్పుడు ఎవరితో చేతులు కలిపినా.. ఎవరితో తెంచుకున్నా… తనే సీఎం హోదాలో కూర్చున్నాడు. బిహార్ లో తన వైరి పక్షం అయిన ఆర్జేడీతో కూడా మిత్రశత్రుత్వాలను నెరిపిన ఘనుడు నితీష్ కుమార్.
ఇది వరకూ ఆర్జేడీ-జేడీయూ భాగస్వామ్యంతో బిహార్ లో ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ను బూచిగా చూపించారు నితీష్. ముఖ్యమంత్రిగా తన వ్యవహారాలకు తేజస్వి అడ్డుపడుతున్నాడంటూ.. ఉన్న ఫలంగా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
క్రితం సారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూలు కలిసి పోటీ చేశాయి. ఈ కూటమికి తేజస్వి యాదవ్ గట్టి పోటీ ఇచ్చాడు. అయితే ఎన్డీయే కూటమికి అధికారం దక్కింది. ఇప్పుడు నితీష్ కు బీజేపీ భయం పట్టుకున్నట్టుంది. చిరాగ్ పాశ్వాన్ మోడల్ ను తన విషయంలో అమలు చేస్తారని ఆయనకు అనిపించినట్టుగా ఉంది.
ఇలా బిహార్ సీఎం పదవికి రాజీనామా చేసి, మళ్లీ ఆర్జేడీ- కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆర్జేడీ ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. నితీష్ నే సీఎం సీట్లో కూర్చోబెట్టి ఆర్జేడీ కీలక పదవులు చేపట్టవచ్చు. తేజస్వికి మరోసారి ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుంది. కాంగ్రెస్ కూడా ఇంతకు మించిన అవకాశం లేనట్టుగా స్పందిస్తోంది.
ఇప్పుడు నితీష్ ను అవకాశవాది అంటూ బీజేపీ నిందిస్తూ ఉంది. కానీ.. గతంలో ఆర్జేడీ-జేడీయూలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాకా… ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని నితీష్ కుమార్ తమతో చేతులు కలిపినప్పుడు నితీష్ అవకాశవాదం కమలం పార్టీకి అర్థం కాలేదా అని!