ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థులు దొరుకుతారా?

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం కేవలం పది నిమిషాల్లోనే తేలిపోవడంతో ఉత్కంఠభరితంగా సాగుతుందన్న ఈ ఎపిసోడ్ చప్పగా మిగిలిపోయిందని కొందరు పెదవి విరుస్తున్నారు. కేసీఆర్ కు ఉప ఎన్నిక తలనొప్పిగా మారుతుందని,…

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం కేవలం పది నిమిషాల్లోనే తేలిపోవడంతో ఉత్కంఠభరితంగా సాగుతుందన్న ఈ ఎపిసోడ్ చప్పగా మిగిలిపోయిందని కొందరు పెదవి విరుస్తున్నారు. కేసీఆర్ కు ఉప ఎన్నిక తలనొప్పిగా మారుతుందని, కాబట్టి ఆయన ఆదేశాల మేరకు స్పీకర్ రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను పెండింగ్ లో పెడతారని చాలామంది ఊహించారు. కానీ సీన్ తలకిందులైంది. కేసీఆర్ ఉప ఎన్నికలో తాడోపేడో తేల్చుకుందామని అనుకున్నట్లుగా ఉంది. అందుకే స్పీకర్ కూడా నాన్చకుండా వెంటనే రాజీనామా ఆమోదించారు. దీంతో ఒక ఉత్కంఠ పోయింది.

బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డే కాబట్టి ఆ పార్టీకి ఎలాంటి టెన్షన్ లేదు. ఇప్పుడు ఉన్న టెన్షనల్లా కాంగ్రెస్ అండ్ టీఆరెస్ కు మాత్రమే. రాజగోపాల్ రెడ్డిని ఢీకొనే అభ్యర్థులను ఈ రెండు పార్టీలు వెదుక్కోవాలి. గులాబీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకే మునుగోడు సీటు గెలుచుకోవడం ముఖ్యం. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన్ని ఓడగొట్టి పగ తీర్చుకోవడం ఆ  పార్టీకి ప్రధానం. ఒకవేళ టీఆరెస్ గెలిస్తే ఆ పార్టీకి అదనంగా ఒక సీటు వచ్చినట్లు అవుతుంది. ఎందుకంటే అది టీఆరెస్ సీటు కాదు కాబట్టి. రెండోది కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టినట్లు అవుతుంది. బీజీపీ దూకుడుకు చెక్ పెట్టినట్లుగా అవుతుంది.

మునుగోడు ఉప ఎన్నిక అనేది ప్రధానంగా బీజేపీ – కాంగ్రెస్ వ్యవహారం. కాబట్టే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. ఇక కాంగ్రెస్ అండ్ టీఆరెస్ సరైన అభ్యర్థులను వెదుక్కోవాలి. ఇప్పుడు అదే ఆ రెండు పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఉప ఎన్నిక రానున్న వేళ మునుగోడు టీఆర్ఎస్ లో సైలెంట్ వాతావరణం ఉండటం చర్చగా మారింది. 

ఇందుకు నియోజకవర్గ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీరే కారణమంటున్నారు. మునుగోడు టీఆర్ఎస్ లో వర్గ పోరు తీవ్రంగా ఉంది. కూసుకుంట్లను పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. తర్వాత గత నాలుగేళ్లుగా పార్టీ ఇంచార్జ్ గా ఆయన చాలా మంది నేతలను టార్గెట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తనకు నచ్చినవారికి పదవులు ఇచ్చి ఇష్టారాజ్యాంగా వ్యవహరించారని అంటున్నారు.

ఇప్పుడు ఆ నేతలంతా కూసుకుంట్లపై తిరుగుబాటు చేస్తున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నికలో కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహకరించే ప్రశ్నే లేదని తేల్చి చెబుతున్నారట. మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఐదుగురు జట్పీటీసీలు, ఐదుగురు ఎంపీపీలు, ఇద్దరు మున్సిపల్ చైర్మెన్లు ఉన్నారు. నియోజకవర్గంలోని స్థానిక ప్రజా ప్రతినిధుల్లో 80 శాతానికి పైగా టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. వాళ్లలో ప్రస్తుతం కూసుకుంట్లకు మద్దతు ఇచ్చేవారు 10 శాతం మంది నేతలు కూడా లేరని తెలుస్తోంది.తమ అసమ్మతిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారట కూసుకుంట్ల వ్యతిరేక వర్గం నేతలు. 

మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ కు రావుకు కేసీఆర్ అప్పగించారు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉపఎన్నికలకు రవీందర్ రావే ఇంచార్జ్ గా ఉన్నారు. 

అందుకే మునుగోడు బాధ్యతలు ఆయనకే అప్పగించారు కేసీఆర్. తక్కెళ్లపల్లి రవీందర్ కు తోడుగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఉప ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. 

కేసీఆర్ ఆదేశాలతో మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో ఈ నేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే నియోజకవర్గంలోని మెజార్టీ నేతలు కూసుకుంట్లకు టికెట్ ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని వాళ్లకు తేల్చి చెప్పారని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గ నేతల తీరుతో తక్కెళ్లపల్లి రవీందర్ రావు టీమ్ షాకైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కేటీఆర్, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. మునుగోడు టికెట్ ను టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్లతో పాటు మరో ఐదుగురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, నారబోయిన రవి ముదిరాజ, కర్నాటి విద్యాసాగర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి ఉన్నారు. వీళ్లంతా కూసుకుంట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఎవరికి వారుగానే కార్యక్రమాలు నిర్వహించిన ఈ నేతలు.. ఇప్పుడు ఏకమయ్యారని తెలుస్తోంది. 

కూసుకుంట్లకు కాకుండా తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని.. కూసుకుంట్ల ఇస్తే మాత్రం తిరుగుబాటు తప్పదని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. దీంతో టికెట్ రేసులో ఉన్న నేతలతోనూ కేటీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. తాజాగా పరిణామాలతో మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒంటరి అయ్యారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ….రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలియగానే… ముందుగా బహిరంగసభ పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. చండూరులో పెద్ద ఎత్తున జన సమీకరణ నిర్వహించి మరీ సభను నిర్వహించారు. 

ఈ సభలో ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ బలప్రదర్శన చేసింది. సంప్రదాయంగా తమకు పట్టు ఉన్న మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతామని రేవంత్ రెడ్డి నమ్మకంతో ఉన్నారు. నల్లగొండ కాంగ్రెస్ సీనియర్లు మునుగోడు బాధ్యత తీసుకునే చాన్స్ లేదు. అందుకే రేవంతే తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఓ కమిటీని ఈ ఎన్నికల కోసం నియమించారు. ముందు ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కార్యకలాపాలు పెంచే అవకాశం ఉంది. చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకుని బీసీ అభ్యర్థిని నిలబెడతామన్న సంకేతాలు పంపారు. మరి అభ్యర్థి ఈయన అవుతాడా ? పాల్వాయి గోవర్ధన్ కూతురు పాల్వాయి స్రవంతి అవుతుందా అనేది చూడాలి.