జస్ట్ శాంపిల్ అంటున్న ఉక్కు కార్మికులు

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసే విషయంలో కేంద్రం దూకుడు చేస్తోంది. తన మాటకు రూటుకు అడ్డే లేదు అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు కానీ, ఇతర…

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసే విషయంలో కేంద్రం దూకుడు చేస్తోంది. తన మాటకు రూటుకు అడ్డే లేదు అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు కానీ, ఇతర విపక్షాల ఆగ్రహాన్ని కానీ అసలు పట్టించుకోవడంలేదు.

దీంతో అయిదు నెలలుగా ఉక్కు కార్మికులు ఆందోళనాపధంలోనే ఉన్నారు. కేంద్రం దృష్టికి మరో మారు తమ సమస్య తేవాలని ఉక్కు సమ్మెకు పిలుపు ఇచ్చారు. దాంతో ఉక్కులో ఉత్పత్తి జరగక మూసుకుంది. మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రాంగణం అంతా బోసిపోయింది.

దీని మీద కార్మిక నాయకులు మాట్లాడుతూ ఇది జస్ట్ సాంపిల్ మాత్రమే. ఇక మీదట మరింత పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడతాం, అపుడు ఉక్కు కర్మాగారం రోజుల తరబడి మూసుకున్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. 

ఇంతకాలం కరోనా కారణంగా స్టీల్ పరిశ్రమ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తికి సహకరించామని వారు చెబుతున్నారు. కేంద్రం కూడా తమ బాధ అర్ధం చేసుకుని తక్షణం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయమని గట్టి ప్రకటన చేయాలని కోరుతున్నారు.

అలాగే నాలుగేళ్ళుగా పెండింగులో పెట్టిన వేతస సవరణను కూడా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి కేంద్రానికి ఉక్కు సెగ తగలాలని కార్మిక లోకం ఏకమై కదం తొక్కుతోంది. మరి బీజేపీ సర్కార్ దీన్ని పట్టించుకుంటుందా చూడాలి.