కేవలం 22 మందికి (బాబు కాకుండా) నాయకుడిగా వుండడం కన్నా, ప్రతిపక్షనేత హోదాను వెనుకబడిన తరగతుల వాళ్లకు కేటాయించేసి, చంద్రబాబు గౌరవంగా పార్టీ అధ్యక్షుడిగా కూర్చోవడం బెటర్ అనే సూచనలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వెనుకబడిన తరగతులను దూరం చేసుకోవడం వల్లనే ఇంతటి దారుణ పరాజయం అనివార్యమైందని, అందువల్ల వారిని దగ్గర చేసుకొవడానికి ఆ వర్గానికే ప్రతిపక్షనేత హోదాను ఇచ్చేయడం బెటర్ అని పార్టీ వర్గాల్లో డిస్కషన్ ప్రారంభమైంది.
కానీ బాబు ఈ పనిచేస్తారా? అన్నది అనుమానం. ఎందుకంటే బాబు అంత సులువుగా ఎవ్వరినీ నమ్మరు. అదీకాక, అసెంబ్లీలో వేరే వాళ్లు ప్రతిపక్షనేత హోదాలో కూర్చుంటే, తాను మామూలు సభ్యుడిగా కూర్చోవాలి. లేదూ అంటే అసెంబ్లీకి వెళ్లడం మానేయాలి. అలా మానేస్తే, జగన్ ను ఫేస్ చేయలేక మానేసారు అంటారు.
అదీకాక 23 మంది సభ్యుల్లో కమ్మ సామాజిక వర్గ నేతలే ఎక్కువ మంది వున్నారు. కాపులు, బిసిలు తక్కువ. అందువల్ల వారంతా తమకు నేతగా బాబే వుండాలని కోరుకుంటారు తప్ప వేరు కాదు. అందుకే కమ్మ సామాజిక వర్గనేత పయ్యావుల కేశవ్ పేరు కూడా ప్రతిపక్షనేతగా వినిపిస్తోంది. ఆ విధంగా అసెంబ్లీలో 150 (ముఖ్యమంత్రి కాకుండా) మంది సభ్యులను ఎదుర్కొవాల్సిన పరిస్థితిని బాబుగారు తప్పించుకోవచ్చు.
మొత్తంమీద ఈ విషయమై తెలుగుదేశం అనుకుల మీడియాలో మాత్రం కొంత డ్రామా నడుస్తుంది. బాబు విముఖతగా వున్నారని, బిసిలకు పగ్గాలు అని, సభ్యులు ఒప్పుకోలేదని, బాబే సమర్థులు అని ఇలా రకరకాలుగా. ఈ కథనాలతో కొన్నాళ్లు రీడర్స్ కు ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది.