మ‌రో మిత్రుడికి బీజేపీ మార్కు ట్రీట్ మెంట్!

దేశంలో ప్రాంతీయ పార్టీలను టార్గెట్ గా చేసుకుని, భార‌తీయ జ‌న‌తా పార్టీ రాజ‌కీయాలు కొన‌సాగుతూ ఉన్న‌ట్టుగా ఉన్నాయి. మిత్ర‌ప‌క్షం అయినా, శ‌త్రుప‌క్షం అయినా.. తేడా లేకుండా ప్రాంతీయ పార్టీల్లో చీలిక‌లు తీసుకు వ‌చ్చి.. చీలిక…

దేశంలో ప్రాంతీయ పార్టీలను టార్గెట్ గా చేసుకుని, భార‌తీయ జ‌న‌తా పార్టీ రాజ‌కీయాలు కొన‌సాగుతూ ఉన్న‌ట్టుగా ఉన్నాయి. మిత్ర‌ప‌క్షం అయినా, శ‌త్రుప‌క్షం అయినా.. తేడా లేకుండా ప్రాంతీయ పార్టీల్లో చీలిక‌లు తీసుకు వ‌చ్చి.. చీలిక వ‌ర్గాల‌ను అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా వాడుకునేలా ఉంది క‌మ‌లం పార్టీ. ఈ క్ర‌మంలో బీజేపీ కొత్త టార్గెట్ నితీష్ కుమార్ అనే మాట వినిపిస్తూ ఉంది.

ఈ మ‌ధ్య‌కాలంలో రెండు ప్రాంతీయ పార్టీల అడ్ర‌స్ ల‌ను మార్చేసింది బీజేపీ. అందులో ఒక‌టి బిహార్ లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ. రామ్ విలాస్ పాశ్వాన్ అనంతరం ఆయ‌న త‌న‌యుడికి సొంత బంధువులే ఝ‌ల‌క్ ఇచ్చారు. ఎల్జేపీలో తిరుగుబాటు రేగింది. ఆ తిరుగుబాటుకు క‌మ‌లం పార్టీ కావాల్సిన అండాదండా ఇచ్చింది. తిరుగుబాటు వ‌ర్గం ఇప్పుడు అస‌లు ఎల్జేపీగా చెల్లుబాటులో ఉంది.

ఇక ఇన్నేళ్లూ త‌మ‌తో క‌లిసి సాగి, రెండుమూడేళ్ల కింద‌ట సీఎం సీటు విష‌యంలో పంతం వ‌చ్చి కాంగ్రెస్, ఎన్సీపీల‌తో చేతులు క‌లిపిన శివ‌సేన‌కూ ఇటీవ‌లే క‌మ‌లం పార్టీ షాక్ ఇచ్చింది. తిరుగుబాటు వ‌ర్గంలో ఇప్పుడు బీజేపీ ప్ర‌భుత్వం మ‌నుగ‌డ‌లో ఉంది మ‌హారాష్ట్ర‌లో.

ఈ ప‌రంప‌ర‌లో బీజేపీ కొత్త టార్గెట్ నితీష్ కుమార్ ఆధ్వ‌ర్యంలోని జేడీయూ అనే విశ్లేష‌ణ వినిపిస్తోంది. బిహార్ లో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిలో జేడీయూ చిన్న పార్టీనే. అయితే నితీష్ కే ముఖ్య‌మంత్రి పీఠాన్ని ఇచ్చి గౌర‌వించింది బీజేపీ. కానీ, ఇదంతా పైకి క‌నిపించేది అని, సీఎం సీట్లో ఉన్నా.. నితీష్ మాట ఏదీ చెల్లుబాటు కావ‌డం లేద‌ని, ఢిల్లీ క‌నుస‌న్న‌ల్లోనే పాల‌న సాగుతోంద‌ని టాక్. 

అంతే కాదు.. చిరాగ్ పాశ్వాన్ కు ఝ‌ల‌క్ ఇచ్చిన రీతిలో నితీష్ కు కూడా క‌మ‌లం పార్టీ త్వ‌ర‌లోనే ట్రీట్ మెంట్ ఇవ్వ‌బోతోంద‌ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌హారాష్ట్ర త‌ర్వాత క‌మ‌లం పార్టీ టార్గెట్ బిహార్ అని ఢిల్లీ నుంచి విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఈ విష‌యం నితీష్ కు కూడా బోధ‌ప‌డింద‌ని, దీంతో ఆయ‌నే బీజేపీతో తెగ‌దెంపులు చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఈ మేర‌కు ఆయ‌న వ‌ర‌స పెట్టి త‌మ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి అక్క‌డా మంత్రాంగం న‌డిపిస్తున్నారు. నితీష్ కుమార్ బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని, కాంగ్రెస్ వైపు మొగ్గు చూప‌నున్నార‌నే టాక్ కూడా ఉంది. సోనియాతో స‌మావేశానికి రెడీ అవుతున్నార‌ట నితీష్. మ‌రి కాంగ్రెస్ తో నితీష్ క‌లిసి ఏం సాధిస్తాడ‌నేది ప‌క్క‌న పెడితే, బీజేపీ దెబ్బకు ఆయ‌న ఈ రేంజ్ లో బిత్త‌ర‌పోయార‌ని స్ప‌ష్టం అవుతోంది.