కామన్ వెల్త్ గేమ్స్ లో భారతదేశం మిశ్రమ ఫలితాలను పొందింది. గతంలో పోలిస్తే అదనంగా పతకాలను సాధించలేకపోయినప్పటికీ, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి గౌరవాన్ని నిలబెట్టుకుంది టీమిండియా. ఈ ఆటల్లో తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లండ్, మూడో స్థానంలో కెనడా ఉంది. నాలుగో స్థానంలో ఇండియా, ఐదో స్థానంలో న్యూజిలాండ్ నిలిచింది.
భారత్ కు మొత్తం 101 పతకాలు దక్కాయి. ఢిల్లీలో 2010లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా భారత్ కు సరిగ్గా ఇన్నే పతకాలు వచ్చాయి. ఇలా గతంలో వచ్చిన నంబర్ కు సరిసమానమైన రీతిలో భారత్ కు పతకాలు దక్కాయి.
ఇక గోల్డ్ మెడల్స్ విషయానికి వస్తే.. భారత్ కు 22 బంగారు పతకాలు దక్కాయి. 2006 లో మాంచెస్టర్ కామన్ వెల్త్ ఈవెంట్స్ లో కూడా భారత్ కు సరిగ్గా ఇదే స్థాయిలో పతకాలు దక్కాయి. ఇలా గతంలో వచ్చిన మెడల్స్ ట్యాలీ ఫీట్లను భారత్ రిపీట్ చేసింది. అయితే పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలవడం మాత్రం కొత్త గౌరవం.
రెండు కోట్ల స్థాయి జనాభా ఉన్న ఆస్ట్రేలియా 178 పతకాలను నెగ్గింది. పది కోట్ల స్థాయిలో జనాభా ఉన్న ఇంగ్లండ్ 176 పతకాలను నెగ్గింది. నలభై లక్షల స్థాయి జనాభా ఉన్న న్యూజిలాండ్ పతకాల పట్టికలో ఇండియా తర్వాతి స్థానంలో నిలిచింది. ఇలా చూస్తే.. అత్యంత భారీ జనాభా ఉన్న భారత్ కు దక్కిన పతకాల స్థాయి ఎంతో చిన్నది. అయితే ఆటల్లో ఈ మాత్రం విజయాలు కూడా భారత్ కు గొప్పే!