పశ్చిమబెంగాల్ గవర్నర్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా గవర్నరే ఆవేదనతో చెప్పడం గమనార్హం. సీఎం మమత ఆరోపణలతో తాను షాక్‌కు గురయ్యానని ఆయన వెల్లడించారు. బెంగాల్ గవర్నర్, సీఎం మమత మధ్య చాలా కాలంగా గొడవ నడుస్తోంది. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.
ఈ నేపథ్యంలో గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్‌పై మమత తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. గవర్నర్ పచ్చి అవినీతి పరుడని, బెంగాల్ విభజనకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు. మమత మీడియాతో మాట్లాడుతూ ‘ఆయన అవినీతిపరుడు. 1996నాటి జైన్ హవాలా కేసు అభియోగపత్రంలో ఆయన పేరు ఉంది. అలాంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గవర్నర్‌గా కొనసాగిస్తోంది. కేవలం భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలనే కలుస్తున్నారు. ఆయన ఆకస్మికంగా ఉత్తర బెంగాల్‌కు ఎందుకు వెళ్లారు? ఉత్తర బెంగాల్ విభజనకు కుట్ర పన్నుతున్నారని అనిపిస్తోంది’ అని విరుచుకుపడ్డారు.
మమత ఆరోపణలతో గవర్నర్ ఖంగుతిన్నారు. వెంటనే ఆయన మమత ఆరోపణలపై స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మమత చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని కొట్టి పారేశారు. అసెంబ్లీని ఉద్దేశించి చేయాల్సిన ప్రసంగంపై తాను కొన్ని ప్రశ్నలు అడిగిన పది నిమిషాలకే ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు.
సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి తప్పుడు, అసత్య ఆరోపణలు చేస్తారని తానెప్పుడూ ఊహించలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏ ఛార్జి షీట్‌లోనూ తన పేరు లేదన్నారు. ఏ కోర్టు నుంచి కూడా తాను స్టే తీసుకోలేదన్నారు. సీఎం మమత నుంచి ఇలాంటి ఆరోపణలు ఊహించలేదన్నారు. ఆమె ఆరోపణలతో తాను షాక్‌కు గురైనట్టు చెప్పుకొచ్చారు.
సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటివి తగవని ఆయన హితవు పలికారు. మరోవైపు బెంగాల్‌లో సీఎం, గవర్నర్ మధ్య గొడవకు పరిష్కారం చూపాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఆ పనిచేయడం లేదు. వాళ్లు వీధికెక్కి రచ్చ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తమాషా చూస్తోందనే విమర్శలు వ్యాపిస్తున్నాయి.