భవిష్యత్తు గురించి ఏదీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారు సామాన్యులు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఈ వేవ్ లేమిటో, వ్యాక్సిన్లేమిటో, మళ్లీ లాక్ డౌన్లంటారో.. అంటూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు సామాన్యులు. వలస వెళ్లి కూలి చేసుకుంటూ కోట్ల మంది బతికే దేశమిది. అలాంటి వలస కూలీల కష్టాలు మాటల్లో వర్ణించేవి కావు. కోవిడ్ ఎన్నో రకాలుగా సామాన్యుల జీవితాన్ని ఛిద్రం చేసింది.
అనేక మంది చిరుద్యోగులు ఉపాధిని పోగొట్టుకున్నారు. కొద్దో గొప్పో చదువుకుని నగరాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు.. పల్లెలకు పరిమితమయ్యారు. పాత పని లేక, కొత్త పని దొరక్క ఇలాంటి వారెంతో మంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కోవిడ్ ఫస్ట్ వేవే ఎంతో మంది ఉపాధిని దెబ్బతీసింది. అప్పట్లో ఊళ్లకు, ఇళ్లకు వచ్చి పడ్డవారు.. రెండో వేవ్ దెబ్బకు ఇక ముందు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.
చిన్న చిన్న ఐటీ కంపెనీల్లో పని చేసిన యువత పరిస్థితి కూడా ఇదే. పది వేలకూ, పదిహేను వేల జీతం స్థాయి ఉద్యోగాల్లో చిన్న చిన్న కంపెనీల్లో పని చేస్తూ ఎలాగోలా నెట్టుకొచ్చే ప్రయత్నం చేసిన బీటెక్, ఎంసీఏ గ్రాడ్యుయేట్లలో ఎంతో మంది ఫస్ట్ వేవ్ సమయంలోనే అలాంటి అవకాశాలను కూడా కోల్పోయారు. సొంతూళ్లకు చేరారు.
మళ్లీ సిటీకి వారు బయల్దేరే సమయానికి, కొత్త అవకాశాలను వెదుక్కోవాలనే ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టే సమయానికి.. సెకెండ్ వేవ్ వచ్చింది. అలాంటి వారు ఇప్పుడు మరింతగా క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. టాలెంట్ ఉన్న వారికి, ప్రెషర్స్ కు కూడా ఇప్పటి పరిస్థితుల్లో కూడా కొత్త కొలువులు దక్కుతున్నాయట. అయితే చిన్న చిన్న ఉద్యోగాలను నమ్ముకుని, అవి పోయిన వారి పరిస్థితే అగమ్యగోచరంగా ఉందని తెలుస్తోంది.
వ్యాపారాలు చేసే వారి ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. లాక్ డౌన్ లు, ప్రజల్లో కూడా ఆర్థిక శక్తి తగ్గడంతో.. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఒక్క మెడికల్ షాపులు తప్ప.. మరెవ్వరికీ మునుపటి స్థాయిలో ఆదాయాలు లేవు. ఇంకోవైపు నిత్యవసరాల ధరలు ఆకాశానికి అంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ప్రజలపై కాసింత కనికరం కూడా చూపడం లేదు. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయల వరకూ చేరుకుంది చాలా చోట్ల.
ఫలితంగా ప్రతీ వ్యయం పెరుగుతోంది. డీజిల్ ధరలు పెరిగాయనే లెక్కలు చెబుతూ కాయగూరల ధరల నుంచి ప్రతి దాని ధరా పెంచుతున్నారు. ఆఖరికి వ్యవసాయం ఖర్చులు కూడా పెరిగిపోయాయి డీజిల్ ధరల దెబ్బకు. ట్రాక్టర్లతోనే దేశంలో ఇప్పుడు ఎక్కువగా సేద్యం జరుగుతుంది. ఇది వరకూ గంట సేద్యానికి ఏడెనిమిది వందలు తీసుకునే వారు కాస్త.. ఇప్పుడు గంటకు వెయ్యి అడుగుతున్నారు. అదేమంటే డీజిల్ ధర పెరిగిందని సమాధానం. దీంతో రైతులపై భారం పెరుగుతూనే ఉంది!
ఒకవైపు చిరుద్యోగులు, మరోవైపు నిరుద్యోగులు, ఇంకా వలస కూలీలు..వీరిలో చాలా మంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దిక్కుతోచని పరిస్థితి. వ్యాపారాలు అంతంతమాత్రం. హోటల్ పరిశ్రమ, ట్రావెల్స్ సంస్థలు దివాళా దశకు కాస్త అటూ ఇటూ ఉన్నాయి. వీటి ఆధారపడిన వారికి జీతభత్యాల ఊసు లేదు కొన్ని నెలలుగా. వ్యాపారం జరిగితే కదా.. పని చేసే వారికి కనీస వేతనాలు అయినా దక్కేందుకు!
ఏతావాతా.. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత పరిస్థితి ఇది. మూడో వేవ్ వస్తుందా, మళ్లీ లాక్ డౌన్లా.. అనే భయాలు సరే సరి. దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు.. యూపీ ఎన్నికల గురించి వ్యూహాల్లో మునిగితేలుతున్నారట. జాతీయ పత్రికలు, జాతీయవాద పత్రికలు కూడా.. యూపీలో బీజేపీ గెలుస్తుందంటూ మళ్లీ తమ రొటీన్ పని మొదలుపెట్టాయి.
కోవిడ్ కష్టాలతో సంబంధమే లేదు, హిందుత్వాదమే గెలుస్తుంది.. బీజేపీ హిందూ నినాదమే విజయం సాధిస్తుందంటూ.. ఆ పత్రికల్లో వరస విశ్లేషణలు, కథనాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా కరోనా పీక్స్ లో ఉన్న సమయంలో కూడా యూపీ ఎన్నికల గురించి తమ పార్టీ ఏర్పాటు చేసుకున్న సమావేశాల్లో పాల్గొన్నారట. యూపీ ఎన్నికలకు అనుసరించిన వ్యూహాలను చర్చించారట. ఇప్పుడు ఆ పనులు మరింత ఊపందుకుంటున్నాయట! ఇదీ కథ!