తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో.. బీజేపీ కూడా రంగంలోకి దిగిందా? అనేంత స్థాయిలో రచ్చ చేస్తున్నారు ఆ పార్టీ నేత, సినీనటుడు సీవీఎల్ నరసింహారావు. ఒకవైపు తెలంగాణ వాదాన్ని, మరోవైపు బీజేపీ వాదాన్ని వినిపిస్తున్నారీయన.
పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చేసిన నరసింహారావు రాజకీయ పార్టీల తరఫున కూడా పని చేశారు. గతంలో లోక్ సత్తా తరఫున పనిచేశారు. ఇప్పుడీయన బీజేపీనట. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను విభజించాలని తను చాన్నాళ్లుగా కోరుతున్నట్టుగా సీవీఎల్ చెబుతున్నారు. తెలంగాణ మా, ఏపీ మా అంటూ విభజించాలని ఈయన కోరుతున్నారట. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఈయన వాపోతున్నారట.
అయినా.. ఉన్న మా ను విభజించడం కన్నా, కొత్తది పెడితే పోయేది కదా! ఈ ప్రయత్నం సీవీఎల్ ఎందుకు చేయలేదో మరి. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను స్థాపించేస్తే సరిపోయేది కదా. అప్పుడు సీవీఎల్ అన్ని రకాల అధికారాలూ అక్కడ చెలాయించేందుకు అవకాశం ఉండేదేమో!
ఇక ప్రకాష్ రాజ్ ను బీజేపీ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అని కూడా అభివర్ణించారు సీవీఎల్. ఒక టీవీ చానల్ చర్చాకార్యక్రమంలో సీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే ఏ మాత్రం పడని ప్రకాష్ రాష్ కు సినిమా వాళ్లు ఎలా సపోర్ట్ చేస్తారన్నట్టుగా ఈయన ప్రశ్నించుకొచ్చారు. ఇలా మా ఎన్నికల విషయంలోకి కూడా హిందుత్వ రాజకీయాన్ని ఆపాదిస్తున్నారు ఈ బీజేపీ నేతాశ్రీ!
ఆ చర్చాకార్యక్రమంలోకి సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును కూడా దించారు. కోట మాట్లాడుతూ.. అప్పుడేం ఏం తొందరొచ్చింది? అంటూ ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటూ కొశ్చన్ చేశారు. గతంలో పరాయి భాష నటులకు, ప్రత్యేకించి విలన్లకు తెలుగు సినిమాల్లో అవకాశం ఇవ్వడాన్ని కోట ఆక్షేపించారు. వారికి నటన రాకపోయినా ఛాన్సులు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరి ఆ లెక్కన ప్రకాష్ రాజ్ కు మా ప్రెసిడెంట్ పదవి అంటే.. కోట దాన్ని సహజంగానే వ్యతిరేకించే అవకాశాలున్నట్టే. అందుకు తగ్గట్టుగానే.. కోట మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మా ఎన్నికలకు సంసిద్ధం అయ్యే ప్రయత్నాలనే ఆయన తప్పు పట్టారు.