సీఎంపై కోపం.. ప్యాంట్ లు చించేసుకుంటున్నారు

మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ వేసుకోవడం వల్లే ఆడవారిపై అఘాయిత్యాలు జరిగే అవకాశముంది, అలాంటి బట్టలు వేసుకున్న మహిళలు, పిల్లలకు ఎలాంటి సందేశమిస్తారంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం…

మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ వేసుకోవడం వల్లే ఆడవారిపై అఘాయిత్యాలు జరిగే అవకాశముంది, అలాంటి బట్టలు వేసుకున్న మహిళలు, పిల్లలకు ఎలాంటి సందేశమిస్తారంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. కొత్తగా పదవిలోకొచ్చిన ఆయన.. రోజుల వ్యవధిలోనే మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలతో చిక్కులు కొనితెచ్చుకున్నారు.

మహిళలంతా ఆయనపై సోషల్ మీడియా వార్ ప్రకటించారు. రిప్డ్ జీన్స్ హ్యాష్ ట్యాగ్ తో ఓ ఉద్యమమే మొదలు పెట్టారు. ఇక చూస్కోండి, టీనేజర్లు, పిల్లలు, పెద్దలు, అమ్మలు, అమ్మమ్మలు.. అందరూ చిరిగిన ఫ్యాంట్లు వేసుకుని తమ సెల్ఫీలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అంతే కాదు, ఫొటోలతో పాటు వారు పెడుతున్న మెసేజ్ లు చూస్తుంటే జనంలో ఇంత ఫ్రస్టేషన్ ఉందా అని అర్థమవుతోంది.

నాకు చిరిగిన జీన్స్ లేదు, కానీ ముఖ్యమంత్రి మాటల తర్వాత జీన్స్ చించుకుని మరీ ఈ ఫొటో పెడుతున్నానని చెప్పింది ఒకావిడ. చిరిగిన జీన్స్ కాదు, చిరిగిన స్కర్ట్ వేసుకుంటా..? ఏం చేస్తారంటూ మరొకావిడ మెసేజ్ పెట్టింది. దేశంలో రేప్ లు జరిగేది స్త్రీల పొట్టి బట్టల వల్ల కాదు, పురుషుల విద్వేష వ్యాఖ్యల వల్ల అంటూ మరో మహిళ విరుచుకుపడింది. సోచ్ బద్ లో, దేశ్ బద్ లో (ఆలోచనలు మార్చుకోండి, దేశాన్ని మార్చండి ) అంటూ ఓ స్లోగన్ తెరపైకి తెచ్చింది మరో యువతి.

బిగ్ బీ మనవరాలితో మొదలు..

ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ వ్యాఖ్యలను తొలుత ఖండించిన అమ్మాయిగా బిగ్ బి మనవరాలు నవేలి నందా వార్తల్లోకెక్కింది.

రావత్ వ్యాఖ్యలను ఖండించిన ఆమె, తన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత నవేలి నందా. అమ్మమ్మ జయాబచ్చన్ చెప్పడంతో ఆ కామెంట్లను తొలగించింది. సీఎం వ్యాఖ్యలను జయ కూడా తీవ్రంగా ఖండించింది.

కంగన స్పందన ఎలా ఉందంటే..?

అయినదానికీ, కాని దానికీ రెచ్చిపోయే కంగనా రనౌత్.. బీజేపీ ప్రేరేపిత కష్టనష్టాలపై నోరు కట్టేసుకుంటుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో అంత రాద్ధాంతం చేసిన కంగన, ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమంపై మాత్రం పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు చిరిగిన జీన్స్ పై సెటైర్లు వేసింది కూడా బీజేపీ ముఖ్యమంత్రే కాబట్టి, కంగన వెరైటీగా స్పందించారు. చిరిగిన జీన్స్ వేసుకోండి, అయితే మరీ బిచ్చగాళ్లలాగా విపరీతపు ఫ్యాషన్ల వైపు వెళ్లకండి అంటూ హితవు చెప్పింది.

కంగన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. బీజేపీ నాయకుల్ని కవర్ చేయడమే పనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. ప్రియాంకా గాంధీ వేసిన సెటైర్ మరో ఎత్తు. ఆర్ఎస్ఎస్ ఖాకీ నిక్కర్లు వేసుకున్న బీజేపీ నేతల ఫొటోలు పోస్టుచేసిన ఆమె, ''అయ్యో.. వాళ్ల మోకాళ్లు కనిపిస్తున్నాయంటూ'' సెటైర్లు వేశారు.

చూస్తుంటే.. తిరత్ సింగ్ రావత్ వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా తయారయ్యేలా ఉన్నాయి. దీనికి బీజేపీ నేతలు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి. 

'మోస‌గాళ్లు' మేకింగ్ వీడియో

నా రగ్డ్‌ లుక్‌ కోసం రెండు నెలలు కష్టపడ్డాను