ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పోరాటానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఇక సెలవని చెప్పకనే చెప్పారు. అయితే ఇది యుద్ధరీతి కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ కంటిన్యూ చేయాలని వైసీపీ పట్టుపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ, జగన్ సర్కార్ మధ్య పోరాటం ఓ యుద్ధాన్ని తలపించింది. ఎట్టకేలకు న్యాయస్థానాల ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్టార్ట్ చేశారు.
అయితే గతంలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సపల్ ఎన్నికలకు బదులుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేశారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకూ నిమ్మగడ్డ సెలవుపై వెళుతున్నారు. దీంతో అధికార పార్టీ నిమ్మగడ్డపై మండిపడుతోంది.
కరోనాను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు వద్దంటే, అప్పుడు మాత్రం ఏవేవో సాకులు చెప్పి న్యాయస్థానాలను ఆశ్రయించాడన్నారు. న్యాయస్థానాల ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను మొదలు పెట్టి, ఇప్పుడు పూర్తి చేయకుండా పదవీ విరమణ చేయాలనుకోవడం సబబా? అని ప్రశ్నిస్తున్నారు.
తమపై యుద్ధాన్ని ప్రకటించి, పూర్తి కాకుండా మధ్యలో విశ్రమించడం నిమ్మగడ్డకే చెల్లిందని విమర్శిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల సమయం అవసరమని, వాటిని కూడా పూర్తి చేస్తే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వివరించారు. కావున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నెలాఖరులోపు పూర్తి చేసేలా ఆదేశించాలని గవర్నర్‌ను సీఎస్ కోరడం గమనార్హం.
ఇదే సందర్భంలో ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు , ఆ పార్టీని ఇబ్బందుల నుంచి తప్పించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ …ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఈ నెల 31న రిటైర్డ్ అవుతున్నారని, అయితే ఆయన ఈ నెల 19 నుంచి 22 వరకు వ్యక్తిగత సెలవుపై వెళుతున్నారన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకపోవడం అంటే రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించకపోవడమే అవుతుందని వాదించారు.
ప్రభుత్వం తరపు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ …ఎన్నికల నిర్వహణకు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ వివరాలు సమర్పించేందుకు గడువు కోరడంతో న్యామూర్తి సోమయాజులు కేసును ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.
రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను ఆసరాగా చేసుకుని జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడంతో పాటు తనకిష్టమైన రాజకీయ పార్టీలకు ప్రయోజనం కల్పించాలనుకున్న నిమ్మగడ్డ ….ప్రజాతీర్పు ముందు ఏమీ చేయలేకపోయారని వైసీపీ ఆరోపిస్తోంది.
జగన్‌పై పోరాటంలో చేతులెత్తేసి , అస్త్ర సన్యాసం చేసి సెలవుపై వెళుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. జగన్‌పై యుద్ధం చేయలేక …శాశ్వతంగా సెలవు పెట్టి వెళ్లిపోతున్నారనే సెటైర్స్ పేలుతున్నాయి.