ఎన్నిక ఏదైనా విజయం వైసీపీదే అని చెప్పక తప్పదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వైసీపీ అంత బలంగా ఉంది. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ప్రతిపక్షాల పాలిట తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక తయారైంది.
అసలే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేక చతికిల పడిన ప్రతిపక్షాలకు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పెనుభారమే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా తుక్కుతుక్కు చేసిన వైసీపీకి టెన్షన్ పట్టుకుంది.
తిరుపతి ఉప ఎన్నికలో విజయంపై ఆ పార్టీకి ఏ మాత్రం అనుమానం లేదు. వైసీపీ టెన్షనంతా కేవలం మెజార్టీపైనే. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 228376 మెజార్టీతో గెలుపొందారు. బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది.
టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మే బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ఆ పార్టీ రెండురోజుల క్రితం ప్రకటించింది. బల్లి దుర్గాప్రసాద్ తనయుడికి కాకుండా కొత్త అభ్యర్థికి టికెట్ కేటాయించడంపై పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నా… ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండదు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్‌ను ఇటీవల ఎమ్మెల్సీగా చేశారు.
ఇదిలా ఉండగా పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నామమాత్రంగా కూడా సత్తా చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైసీపీ ప్రదర్శించిన ఆధిక్యత కొనసాగాలంటే ఉప ఎన్నికలో కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల వరకూ మెజార్టీ సాధించాల్సి ఉంటుంది.
అంతకంటే ఏ మాత్రం తక్కువ మెజార్టీ వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన ఆధిక్యతకు విలువ ఉండదు. అందుకే వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు టీడీపీ ఉప పోరులో పరువు నిలుపుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ సాధించే మెజార్టీపైన్నే అందరి దృష్టి అని చెప్పక తప్పదు.
సొదుం రమణ