గోరంట్ల మాధవ్ నగ్న వీడియో రెండు మూడు రోజులు సంచలనం సృష్టించి చల్లబడింది. అంతకు ముందు కాసినోల్లో ప్రజాప్రతినిధులు వార్త జోరుగా తిరిగి, మాధవ్ వచ్చేసరికి తప్పుకుంది. మాధవ్‌ని మించి ఇంకోటి వస్తే ఇదీ అంతే.
పుష్ప సినిమాలో ఈ కాలు నాదే, ఆ కాలు నాదే అనే స్టైల్‌లో మాధవ్ కూడా ఆయనకి ఉన్నది, కావాల్సిన వాళ్లెవరికో చూపించుకున్నాడు. దీంట్లో సమాజానికి వచ్చిన నష్టమేం లేదు. నైతికత అంటారా, మనం నైతికంగా పతనమై చాలా కాలమైంది. కొత్తగా గుండెలు బాదుకునే పనిలేదు.
కాకపోతే నెహ్రూ, ఇందిరాగాంధీ, మురార్జీ, వాజ్‌పేయ్, ఎల్‌కే అద్వానీ లాంటి గొప్పవాళ్లు కూచున్న పార్లమెంట్‌లో మాధవ్ కూడా ఉన్నాడు. మనది, మన బిడ్డలది భావితరాల భవిష్యత్ నిర్మించే చట్టాల రూపకల్పనలో మాధవ్ లాంటి వాళ్లు కూడా భాగస్వాములు అనే చేదు నిజాన్ని భరించాలి.
మాధవ్ అలా కనిపించడాన్ని తప్పు పట్టలేం. అది ఆయన ఇష్టం. మాధవ్ నైజం అది. ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే విపరీత ప్రవర్తన ఆయనకి కొత్తకాదు. ఇంకోలా ప్రవర్తిస్తేనే ఆశ్చర్యం. మనకి తెలియకపోవచ్చు కానీ, చిన్నప్పటి నుంచి స్కూల్లో , కాలేజీల్లో కూడా అదే ప్రవర్తనతో ఉండే వుంటాడు. పోలీస్‌శాఖలో ఒడ్డూ, పొడుగూ చూస్తారు కానీ, మానసిక రుగ్మతలు తెలుసుకుని ఉద్యోగాలు ఇవ్వరు.
నగ్న వీడియో కంటే కూడా సమాజానికి మాధవ్‌తో జరిగిన ఎక్కువ నష్టం ఏమంటే ఆయన చాలా ఏళ్లు పోలీస్ అధికారిగా వుండడం. ఇలా విపరీత ప్రవర్తనతో ఆయన ఎంత మంది అమాయకుల్ని లాఠీలతో చావబాది ఉంటాడు, జైళ్లకి పంపి వుంటాడు, ఇతని దుర్మార్గ విధి నిర్వహణతో ఎందరి జీవితాలు అల్లకల్లోలమై వుంటాయో ఊహించాలంటేనే భయం. సాధారణంగా తమ వాళ్లని వెనుకేసుకొచ్చే పోలీస్ శాఖ కూడా భరించలేక అనేక సార్లు సస్పెండ్ చేసిందంటే మాధవ్ ఏంటో అర్థమవుతుంది. ఎంత మంది మహిళలని వేధించాడో తెలియదు కానీ, అధికారికంగా ఒక రేప్ కేసు వుంది.
జేసీ దివాకర్‌రెడ్డిని సవాల్ చేసి హీరోగా మారిన మాధవ్‌ని ఏవో సమీకరణలు చేసి వైసీపీ టికెట్ ఇచ్చింది. గెలిచాడు. జగన్ వేవ్‌లో మాధవ్ ప్లేస్‌లో ఎవరైనా గెలిచేవాళ్లు. మాధవ్‌ని ఎంచుకున్న ఫలితం వైసీపీకి ముఖ్యంగా జగన్‌కి కళ్ల ముందు భారీగా కనిపిస్తోంది.
ఇప్పుడు వైసీపీ ముందున్న ఆప్షన్లు ఏమంటే మౌనంగా వుండిపోతే కొంత కాలానికి అందరూ మరిచిపోతారనుకోవడం. జనం సంగతేమోగానీ, ప్రత్యర్థులు ఈ ఆయుధాన్ని గట్టిగానే వాడుకుంటారు. మాధవ్‌ను సస్పెండ్ చేయడం రెండో ఆప్షన్. రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లడం మూడో ఆప్షన్. ఎన్నికల్లో ఎలాగూ వైసీపీ గెలుస్తుంది. అయితే ఎన్నికలకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పుకోవాలి. ఇదో ఇరకాటం సీన్.
అందుకని వైసీపీ ఏం చేస్తోందంటే తెలుగుదేశం బాగోతాల్ని బయట పెట్టే వీడియోలు వెతుకులాటలో వుంది. బెంగళూరు, చిక్‌బలాపుర్ మసాజ్ పార్లర్లకి రెగ్యులర్‌గా వెళ్లే వాళ్లపై ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టు వార్తలు. దొరికినా దొరుకుతారు. టీడీపీలో ఏమీ మహానుభావులు , మహాపురుషులు లేరు. కాకపోతే మాధవ్ దొరికాడు. వీళ్లు ఇంకా దొరకలేదు.
అంటే త్వరలోనే మనం ఇంకొందరి నిజరూప దర్శనాలు చూడబోతున్నాం. అపుడు మీరు దొంగ, మీరూ దొంగలే అని అరుచుకుంటారు. ఎవరి చానళ్లలో వాళ్లకు అనుకూలమైన చర్చలు జరుగుతాయి. చూసిన వాళ్లకి ఫిట్స్ వచ్చి ఆస్పత్రుల్లో చేరుతారు.
మాధవ్‌ని ఎంపీ చేసి జగన్ ఒక రకంగా జనాలకి మంచి చేశాడు. ఎంపీగా కంటే కూడా పోలీస్ అధికారిగానే ఆయన వల్ల జనానికి ఎక్కువ హాని. కనీసం 20 ఏళ్లు DSP, ASP స్థాయిల్లో పనిచేసి నరకం చూపించేవాడు. వీడియో తర్వాత మళ్లీ టికెట్ ఇస్తారని అనుకోలేం. (ఇస్తే వైసీపీకి వందనం, గెలిపిస్తే జనానికి పాదాభివందనం) మళ్లీ పోలీస్‌గా వెళ్లలేడు. పౌరుడిగా ఓవర్ చేస్తే జనం తంతారు. మాధవ్ తన గొయ్యిని తానే వీడియో ద్వారా తవ్వుకున్నాడు.
మాధవ్ ఉదంతాన్ని జగన్ మెడకి చుట్టి విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. జగన్ కొత్తగా చేసిందేమీ లేదు. పాలిటిక్స్‌లోకి మాధవ్ లాంటి వారు రావడం ప్రారంభమై దశాబ్దాలు దాటింది. అన్ని పార్టీల్లోనూ వీళ్లు ఉన్నారు. వీళ్లే ఎక్కువ ఉన్నారు.
ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రజలకి అభివృద్ధి చూపకుండా ఇంకేదో చూపిస్తున్నాడంటే మనమంతా సిగ్గుపడాలి. అయితే సిగ్గు పడే విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటన్నిటికి మనం సిగ్గు పడుతున్నామా? అనేదే ప్రశ్న. క్రిమినల్ కేసులు, రేప్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్లెందరో చట్టసభలకి ఎన్నిక అవుతున్నారు. మళ్లీ మళ్లీ గెలుస్తున్నారు. సాక్ష్యాత్తూ ఒక పార్టీ అధ్యక్షుడే ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ ఓటుకి నోటు కేసులో వీడియోలో గొంతు వినిపించాడు. సిగ్గు పడడం ప్రారంభిస్తే మన టైమంతా దానికే సరిపోతుంది.
ప్రపంచమంతటా మగతనాన్ని సింగిల్ డేలో ప్రదర్శించడం ఇప్పటి వరకూ ఎవరి వల్లా కాలేదు. ఆ క్రెడిట్ గోరంట్ల మాధవ్‌దే.