జనసేనాని పవన్‌కల్యాణ్ ట్విటర్ వేదికగా విసిరిన “చేనేత” సవాల్‌ను మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్వీకరించారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. చేనేత వస్త్రాల్ని ధరించి సోషల్ మీడియాలో షేర్ చేయాలని చంద్రబాబునాయుడు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి పవన్‌కల్యాణ్ సవాల్ విసరడం గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ సవాల్‌ను మాజీ మంత్రి బాలినేని గౌరవించారు. చేనేత వస్త్రాల్ని ధరించి ఆయన ట్విటర్లో షేర్ చేశారు. చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ పవన్‌కల్యాణ్ విసిరిన చేనేత సవాల్‌ను స్వీకరించానని, అందుకు ధన్యవాదాలని ట్వీట్ చేశారు. అలాగే వైఎస్సార్ ప్రభుత్వంతో తాను చేనేతమంత్రిగా చిత్తశుద్ధితో పని చేశానని పేర్కొన్నారు. ఆనాడు వైఎస్సార్ చేనేతల కోసం రూ. 300కోట్లు రుణమాఫీ చేయడాన్ని గుర్తు చేశారు.
మరో ట్వీట్లో ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం నేతన్నల కోసం వైఎస్సార్ నేతన్న నేస్తం దగ్గరి నుంచి ఎన్నో పథకాలు అందిస్తున్నామని వివరించారు. అప్పుడైనా, ఇప్పుడైనా చేనేతల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం నిజాయితీతో పని చేస్తున్నట్టు వివరించారు. అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని బాలినేని కోరారు.
జనసేన, వైసీపీ ఉప్పునిప్పులా ఉన్న పరిస్థితుల్లో బాలినేని, పవన్‌కల్యాణ్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగడం ఆరోగ్యకర రాజకీయాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. పైపెచ్చు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బాలినేని సమీప బంధువు కావడం విశేషం.