టాలీవుడ్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నే మార్చేసింది. ఎన్ఆర్ఎ పద్దతి. నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ అనే ఈ పద్దతిలో నిర్మాత సినిమా డిమాండ్ మేరకు ఒక్కో ఏరియాకు ఇంత మొత్తం అని అడుగుతాడు. ఇరువైపులా డిస్కషన్లు, సినిమా స్టామినా, కాంబినేషన్ అన్నీ చూసి ఆ ఫిగర్ ఫిక్స్ అవుతుంది.
సినిమా విడుదలయిన తరువాత ఈ మొత్తం అంతా వసూలు అయ్యే వరకు డిస్ట్రిబ్యూటర్ కు గండమే. ఆ మొత్తం దాటిన తరువాత వచ్చేది లాభం. అందులోంచి 20 శాతం మాత్రం తను తీసుకుని మిగిలినది మళ్లీ నిర్మాతకే ఇవ్వాలి. దాన్నే ఓవర్ ఫ్లోస్ అంటారు. చిన్న చితక నిర్మాతల సినిమా హిట్ అయితే డిస్ట్రిబ్యూటర్లు ఆడేసుకుంటారు. ఓవర్ ఫ్లోస్ ఇవ్వరు. అదే పెద్ద సంస్థలయితే లెక్కలు అన్నీ కూపీ లాగి మరీ ముక్కు పిండి వసూలు చేస్తాయి.
సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ కు ఇబ్బందే. అయితే గత కొన్నేళ్లుగా సినిమా ఫ్లాప్ అయితే ఎన్ఆర్ఎ మొత్తంలో కొంత మొత్తం నిర్మాత వెనక్కు ఇచ్చే పద్దతి మొదలైంది. అది మొత్తం నష్టం అంతా కాదు. మహా అయితే అందులో పావలా వాటా. అజ్ఞాతవాసి సినిమాతో ఇది మొదలైంది. అలా కంటిన్యూ అవుతోంది. ఎప్పుడయితే ఇలా వెనక్కు ఇవ్వడం, తీసుకోవడం అలవాటైందో, డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్ద సంస్థల సినిమాలను వెనక ముందు చూడకుండా తీసుకుంటున్నారు. ఎంతో కొంత వెనక్కు ఇస్తారులే అన్న ధీమా.
ఇంకో పద్దతి కూడా జస్ట్ అడ్వాన్స్ మీద సినిమా ఆడించడం. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కు రిస్క్ వుండదు. కానీ నిర్మాతల చేతిలో పడిన అడ్వాన్స్ అంత వేగం తిరిగి రావు. మరో సినిమాలో చూసుకుందా అంటారు.
అయితే ఇక ఈ పద్దతులు వద్దు అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. తాము రిస్క్ తీసుకుంటూ, కష్టపడుతూ వుంటే అయితే అసలు రావడం లేదా జస్ట్ కమిషన్ మాత్రమే వస్తోందని అంటున్నారు. ఈ రోజు జరిగిన గిల్డ్-డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెప్పారు.
ఎన్ఆర్ఎ పద్దతి వద్దు అని. అయితే అడ్వాన్స్ మీద పంపిణీ చేస్తాం. అది కూడా తేడా వస్తే సినిమా విడుదలయిన ఇన్ని రోజుల్లో తిరిగి ఇవ్వాలనే నిబంధన వుండాలి. ఆ టైమ్ దాటితే వడ్డీలు చెల్లించాలి. లేదా అవుట్ రేట్ న సినిమా అమ్మేసే పద్దతి వుండాలి. అలా కొనుక్కుంటే రిస్క్, లాభం రెండూ తామే పడతామని చెప్పారు.
నైఙాంలో బిగ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా గత కొంతకాలంగా ఇదే ఆలోచనతో వున్నారు. సినిమాలను ఎన్ఆర్ఎ పద్దతిని తీసుకోకూడదని, అవుట్ రేట్ న కొనేసుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారు. అందువల్ల ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. కానీ ఇలా అంటే నిర్మాతల ఏమంటారో మరి?