ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబు దిట్ట. ఏదో ఒక రకంగా వ్యవహారాన్ని తనవైపు తిప్పుకుంటారు. ప్రత్యర్థులు కూడా అంగీకరించే విషయం ఇది. ఈసారి కూడా చంద్రబాబు ఏదో చేస్తున్నారు. అదేంటనేది మాత్రం నిపుణులు, విశ్లేషకులకు కూడా అంతుచిక్కడం లేదు. పైకి ఒకటి కనిపిస్తోంది. తెరవెనక మాత్రం ఇంకేదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మొదట ఈవీఎంలపై అనుమానం వ్యక్తంచేశారు చంద్రబాబు. ఆ తర్వాత అన్ని వీవీ ప్యాట్లు లెక్కించమని డిమాండ్ చేశారు. ఇప్పుడేమో ఈవీఏం కౌంటింగ్ కంటే ముందు వీవీ ప్యాట్లు లెక్కించమని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎన్నికల సంఘాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు.. అంతిమంగా ఏం సాధించబోతున్నారు? దేనికోసం ఇదంతా చేస్తున్నారనేది ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది.
ఓవైపు ఇలా చేస్తూనే, మరోవైపు రింగ్ మాస్టర్ రామోజీరావుతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇంకోవైపు ఎగ్జిట్ పోల్స్ తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ పైకి ధైర్యంగా కనిపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరిగ్గా లేవంటున్నారు. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి సూచనలు, సలహాలు, విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా ఇతర పార్టీలు, నేతలతో సమావేశాలకు ఎగబడుతున్నారు.
ఇదంతా చూస్తుంటే.. చంద్రబాబు తెరవెనక ఏదో మాస్టర్ ప్లాన్ తోనే ఉన్నట్టు అనుమానిస్తున్నారు విశ్లేషకులు. మరీ ముఖ్యంగా కౌంటింగ్ కు సరిగ్గా 48 గంటలు మాత్రమే ఉందనగా, బాబు తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఏ రోజు ఏం చేస్తారో ఊహించని విధంగా ఉంది పరిస్థితి.
కేవలం ఈ 4 రోజులు మీడియాలో నలిగేందుకే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారా? లేక ఆఖరి నిమిషంలో మొత్తం సీన్ ను తారుమారు చేయబోతున్నారా? ఎలాగూ ఓడిపోతున్నారని తెలిసి, కేంద్రస్థాయిలో సంబంధాల కోసం బాబు ఇలా ఏదో ఒక అంశం పట్టుకొని మిగతా నేతల్ని కలుస్తున్నారని ఎక్కువమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరికొంతమంది మాత్రం ఆఖరి నిమిషంలో చంద్రబాబు ఏదైనా చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ప్రస్తుతం బాబు చేస్తున్నది ప్రచార ఆర్భాటమేనా లేక ప్లాన్-బి ఏదైనా ఉందా అనే విషయం మరో 24 గంటల్లో తేలిపోతుంది. ఒకటి మాత్రం వాస్తవం.. చంద్రబాబును ఆఖరి నిమిషం వరకు నమ్మడానికి వీల్లేదు.