త్వరలోనే రేవంత్ రెడ్డికి తొలి పరీక్ష

ఆమధ్య నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు, తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి లింకు పెట్టింది అధిష్టానం. అది తెగలేదు, తెల్లారలేదు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. పీసీసీ పీఠాన్ని రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది.…

ఆమధ్య నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు, తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి లింకు పెట్టింది అధిష్టానం. అది తెగలేదు, తెల్లారలేదు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. పీసీసీ పీఠాన్ని రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది. మరి రేవంత్, హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించి తనపై రాహుల్ గాంధీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారా? టీఆర్ఎస్, బీజేపీ కుమ్ములాట మధ్య కనీసం రెండో స్థానాన్ని అయినా కాపాడుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలన్నీ కాంగ్రెస్ పతనానికి కారణం అవుతున్నాయి, పరోక్షంగా బీజేపీకి తెలంగాణలో పునాదులు వేస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభ స్థానాన్ని కోరుకోవడంతో ఏడాదిలోగా వచ్చిన తొలి ఉప ఎన్నికలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం హుజూర్ నగర్ ని టీఆర్ఎస్ కి సమర్పించుకుంది. 

దుబ్బాకలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న బీజేపీ, ఉప ఎన్నికల్లో ఏకంగా విజేతగా నిలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతు కాగా, బీజేపీ మేయర్ కుర్చీని అందుకుంటుందా అన్నంత పని చేసింది. ఇక నాగార్జున సాగర్ లో జానారెడ్డి కోల్పోయిన ఓట్ల శాతం, బీజేపీకి ప్లస్ అయింది.

తాజాగా హుజూరాబాద్ ఎన్నికల విషయానికొస్తే అసలు అభ్యర్థి దొరుకుతాడా లేదా అనే అనుమానంలో పడిపోయింది జాతీయ పార్టీ కాంగ్రెస్. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థిగా గట్టి పోటీ ఇస్తారనుకున్న కౌశిక్ రెడ్డి, మంత్రి కేటీఆర్ తో ఓ ప్రైవేట్ మీటింగ్ తర్వాత పలు అనుమానాలకు తావిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. దీంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి.

హూజూరాబాద్ లో టీఆర్ఎస్ కి ఎప్పుడూ కాంగ్రెస్, టీడీపీలే గట్టి పోటీ ఇస్తూ వచ్చాయి. 2014, 2018 ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ఉంది. అయితే ఈ సారి జరగబోతున్న ఉప ఎన్నికల్లో హడావిడి అంతా టీఆర్ఎస్, బీజేపీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో చేరి కమలం పువ్వు గుర్తుపై పోటీ చేస్తున్నారు. పార్టీ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఇటు టీఆర్ఎస్ భావిస్తోంది.

ఓవైపు ఈటల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలసి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆయనకు సపోర్ట్ గా రాష్ట్ర బీజేపీ కూడా కదలి వచ్చింది. టీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు సంధిస్తూ ముందుకెళ్తోంది కమలదళం. అటు టీఆర్ఎస్ కూడా మంత్రుల్ని రంగంలోకి దిగి పనులు చక్కబెడుతోంది. 

స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు, ఈటల వెంట వెళ్లకుండా బందోబస్తు చేసింది. ఎప్పుడూ లేనిది సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సొంత పార్టీ నేతలకే అపాయింట్ మెంట్ ఇవ్వని ఆయన, ప్రతిపక్షాలతో కూడా మీటింగ్ లు పెడుతున్నారు. ఒకరకంగా హుజూరాబాద్ లో టఫ్ ఫైట్ కి సిద్ధమయ్యాయి బీజేపీ, టీఆర్ఎస్.

టీఆర్ఎస్, బీజేపీ పోటీ మధ్యలో కాంగ్రెస్ అడ్రస్ పూర్తిగా గల్లంతయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అభ్యర్థి కౌశిక్ రెడ్డి అయినా, కాకపోయినా.. అక్కడ కాంగ్రెస్ కి పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి కట్టబెట్టింది. అందులోనూ రేవంత్ వచ్చీ రాగానే, బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని బాంబు పేల్చారు. 

ఈటలను బీజేపీలో చేర్చింది కేసీఆరేనని.. కేసీఆర్ సన్నిహితుడు ఒకరు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం కూడా సమకూర్చారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ, ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ రెండిటిపై బురదజల్లారు రేవంత్ రెడ్డి.

ఇప్పటి వరకూ హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే బలమైన పోటీ ఉందని అనుకుంటున్నారంతా. ఈ దశలో పీసీసీ పదవి చేపట్టిన రేవంత్ కి ఈ ఎన్నిక కీలకంగా మారింది. అభ్యర్థిని వెదకడం దగ్గర్నుంచి ప్రచార బాధ్యత అంతా ఆయనే భుజానికెత్తుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ గెలవలేకపోయినా, కనీసం రెండో స్థానం నిలబెట్టుకోవడం ఆ పార్టీ ముందు, రేవంత్ రెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యం. హుజూరాబాద్ ఉప ఎన్నిక పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ కి తొలి పరీక్ష కాబోతోంది.