తెలుగు నటీనటుల సంఘం 'మా' ఎన్నికల వ్యవహారం రోజు రోజుకు స్పీడ్ అందుకుంటోంది. ప్రకాష్ రాజ్, జీవిత, హేమ్ ఇప్పటికే పోటీకి దిగుతున్నామని ప్రకటించారు.
లేటెస్ట్ గా మరో నటుడు కూడా రంగంలోకి దిగుతున్నారు. వైవిధ్యమైన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు తాను కూడా ‘మా’ బరిలో ఉన్నానని ప్రకటించారు.
స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగుతున్నట్లు ఆదివారం ఆయన ప్రకటించారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం అన్ని రకాల కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఎంత మంది పోటీ పడినా ఓట్లు చీల్చడానికి పనికి వస్తారేమో కానీ, నిజానికి పోటీ ప్రకాష్ రాజ్, విష్ణు, జీవితల నడుమే వుంటుంది. హేమ పోటీ చేస్తే జీవిత ఓట్ బ్యాంక్ చీలే అవకాశం వుంది. కానీ హేమ, జీవిత పేర్లు చివరి వరకు వుంటాయా? అన్నది అనుమానమే.
జీవిత ఇప్పటికే ఓ మీడియాకు ఇంటర్వూ ఇస్తూ, పోటీ చేసే విషయం ఆలోచిస్తున్నా అన్నారు. తప్ప, తను ఇచ్చిన ప్రకటన మేరకు కచ్చితంగా పోటీలో వున్నా అనే పద్దతిలో మాట్లాడలేదు.
''…నేను ఎలాంటి ప్యానల్‌ను తయారుచేయను. ఒక వేళ పోటీ చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా. ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ‘మా’ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరుగుతాయి.
ఇంకా రెండు నెలల సమయం ఉంది కదా!..'' అని ఆమె అన్నట్లు వార్తలు వచ్చాయి. చూస్తుంటే జీవిత పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది.
మొత్తం మీద మా ఎన్నికలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి.